తెగ తాగించిన బాబు సర్కారు
కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులైపారిన మద్యం
4 రోజుల్లోనే రూ.585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మందుబాబుల తుక్కురేగ్గొట్టింది. జేబులకు భారీగా చిల్లుపెట్టింది. ‘ఫుల్లుగా తాగండి...తాగి ఊగండి..’ అన్నదే తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేట్ ఖజానా అంతగా కాసులతో గలగల లాడుతుంది. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను అవకాశంగా మలుచుకుని మద్యం ఏరులై పారించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులిచ్చి మరీ మందుబాబుల జేబులు గుల్ల చేసింది. చివరి నాలుగు రోజుల్లోనే భారీగా రూ.585.70 కోట్ల విలువైన మద్యాన్ని తాగించేసింది. 2024లో చివరి నాలుగు రోజులతోపోలిస్తే 2025లో చివరి నాలుగు రోజుల్లోనే ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం, బీరు అమ్మకాలు 34.4 శాతం పెరగడం విభ్రాంతి కలిగిస్తోంది.
సిండికేట్‌కు ఫుల్ జోష్..
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పాత రికార్డులను తిరగరాయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. అందుకే మద్యం విక్రయ వేళలను ఉదయం 6గంటల నుంచి అర్దరాత్రి 1గంట వరకు అధికారికంగా పొడిగించింది. తెల్లవారే వరకు మద్యం విక్రయించినా పట్టించుకోవద్దని ఎక్సైజ్, పోలీసు అధికారులను అనధికారికంగా ఆదేశించింది. ఫలితంగా 2024తో పోలిస్తే 2025 చివరి నాలుగు రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా
పెరిగాయి.
ఇవిగో గణాంకాలు..
⇒ 2024 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 5,18,844 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2,42, 351 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.445.22 కోట్లు.
⇒ 2025 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 7,32,658 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,91,082 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.585.70 కోట్లు.
⇒ అంటే 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచి్చంది.
⇒ ఇక 2024 డిసెంబర్‌తో పోలిస్తే 2025 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్‌లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు.
⇒ కాగా 2025 డిసెంబర్‌లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. ఈ గణాంకాలన్నీ ఎక్సైజ్‌శాఖ అధికారికంగా వెల్లడించినవి.
ఎమ్మార్పీ కంటే అధిక బాదుడు అదనం
కాగా టీడీపీ మద్యం సిండికేట్ ఎమ్మార్పీ కంటే అదనంగా మందుబాబుల నుంచి దండుకుంది ప్రతి క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.50, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30 అదనంగా వసూలు చేసింది. తద్వారా అనధికారికంగా మరో రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.
టాప్‌లో విశాఖ
డిసెంబర్‌లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. రూ.30.7 కోట్ల మద్యం అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.
⇒ 34.4 శాతం నాలుగురోజుల్లోనే పెరిగిన బీర్ల అమ్మకాలు
⇒ 11 శాతంనాలుగు రోజుల్లోనే పెరిగిన లిక్కర్ విక్రయాలు
⇒ రూ.178.6 కోట్లు డిసెంబర్‌లో ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం మద్యం అమ్మకాల విలువ
⇒ రూ. 169.4 కోట్లు డిసెంబర్‌లో మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా


