పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్ షురూ
పులికాట్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు
ఈ నెల 10, 11న నిర్వహణకు సన్నాహాలు
విదేశీ వలస విహంగాల వీక్షణకు తరలిరానున్న ప్రకృతి ప్రేమికులు
సూళ్లూరుపేట : కిలకిలా రావాల సవ్వడికి వేళైంది. ప్రకృతి ప్రేమికుల హృదయాలను పులకింపజేసే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు పులికాట్ సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైబీరియా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే శీతాకాల అతిథులు ఇప్పటికే కనువిందు చేస్తున్నాయి. ఆంధ్రా – తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటూ తమ జీవనశైలిని ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నాయి.
ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది జనవరి 10, 11న నిర్వహించనున్నారు. గతంలో సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలు కేంద్రాలుగా ఈ వేడుక నిర్వహించేవారు. ఈ ఏడాది అదనంగా ఇరక ఐల్యాండ్, శ్రీసిటీ, ఉబ్బలమడుగు జలపాతంతో కలిపి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పండగను రెండు రోజులకు కుదించేయడంతో ప్రకృతి ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శీతాకాలంలో విదేశీ విహంగాల సందడి
పులికాట్ సరస్సు జలకళ సంతరించుకోగానే సుమారు 150 నుంచి 160 రకాల పక్షులు ఇక్కడకు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సులో లక్షలాది పక్షులు ఆహారవేటలో చేసే విన్యాసాలు పర్యాటకులకు కనులవిందు చేస్తుంటాయి. ఫ్లెమింగోలు (సముద్ర రామ చిలుక), పెలికాన్ (గూడబాతులు), పెయింటెడ్‌స్టార్క్స్ (ఎర్రకాళ్లకొంగలు) ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ) సీగల్ (సముద్రపు పావురాళ్లు), నారాయణపక్షి, నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క, నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటికాకులు, స్వాతికొంగలు లాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి.
అందుకే పక్షుల భూతల స్వర్గమని ఈ ప్రాంతం పేరుపొందింది. ముఖ్యంగా సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ లాంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో 2001లో నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చొరవతో ఆరంభమైన వేడుకను 2013లో టూరిజం క్యాలెండర్‌లో చేర్చారు. 2016లో రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించి పర్యాటక శాఖ నుంచి నిధులు కేటాయిస్తున్నారు.
రెండు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా, జీవ వైవిధ్య సరస్సుగా గుర్తింపు పొందిన పులికాట్ విదేశీ వలస పక్షులకు ఆతిథ్యమిచ్చి ఆహారం అందిస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో సుమారు పది వేల కుటుంబాలకు జీవనోపాధి కలి్పస్తోంది. ఇక్కడ ఈ ఏడాది రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, పులికాట్ సరస్సు పరిరక్షణపై పర్యావరణవేత్తలతో సెమినార్లు నిర్వహించనున్నారు.
తడ, భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికార్ ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ, షార్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు శ్రీసిటీ సెజ్‌లో కంపెనీలు, ఇరకం ఐల్యాండ్‌లో బోట్ షికార్, ఉబ్బల మడుగులో జలపాతం సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


