వ్యసనాలతో ప్రాణ సంకటం
దేశంలో 62 శాతం నోటి క్యాన్సర్ కేసులకు పొగాకు, మద్యపానమే ప్రధాన కారణం
అలవాట్లు మితంగా ఉన్నా ప్రమాదమే
ప్రతి 10 మంది వ్యసనపరుల్లో ఆరుగురికి నోటి క్యాన్సర్
టాటా మెమోరియల్ ట్రస్ట్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: క్యాన్సర్ మహమ్మారి ఏటా దేశంలో లక్షలాది మందిని కబళిస్తోంది. రోజురోజుకూ జబ్బు విజృంభణ పెరుగుతూనే ఉంది. పలు క్యాన్సర్ల వ్యాప్తికి ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధుల్లో నోటి క్యాన్సర్ ఒకటి. దేశంలో 62 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగమే అని తెలుస్తోంది. ఈ అంశాన్ని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ ఎపిడమాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవల ఈ విషయం వెల్లడించారు. 2010–2021 మధ్య 1,803 మంది నోటి క్యాన్సర్ బాధితులు, 1,903 మంది ఆరోగ్యవంతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అధ్యయనంలోని అంశాలు ఇటీవల బీఎంజీ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.
ఆ కాంబినేషన్ యమా డేంజర్
మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మితమైన చెడు అలవాట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవనే భావనను ఈ అధ్యయనం పూర్తిగా కొట్టిపడేసింది. ఆరోగ్యకరమైన స్థాయిలో మద్యపానం అపోహేనని తోసిపుచ్చారు. వ్యసనాలు అత్యంత మితంగా ఉన్నా.. క్యాన్సర్ ముప్పు మాత్రం అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రోజుకు 11.4 ఎంఎల్ మద్యం సేవించినా నోటి క్యాన్సర్ బారినపడే అవకాశం 50 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.
రోజూ బీర్ తాగేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. మద్యం సేవించని వారితో పోలిస్తే, సేవించే వారిలో జబ్బు బారిన పడే ముప్పు 68 శాతం ఎక్కువేనని గుర్తించారు. మద్యపానంతోపాటు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో మహమ్మారి ముప్పు అత్యధికంగా ఉంటుందని తేల్చారు. ఆల్కహాల్‌లోని ఇథనాల్ నోటి లోపలి పొరను పల్చబరుస్తుందని, పొగాకు వినియోగించే వారిలో క్యాన్సర్ కారకాలు సులభంగా కణాల్లోకి చొచ్చుకుని పోతాయని వివరించారు. మద్యం, పొగాకు కాంబినేషన్ ఆరోగ్యాన్ని త్వరగా క్షీణింపజేయడంతోపాటు, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. దేశంలో సుమారు 11.3 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ఆల్కహాల్ ప్రధాన కారణమని అధ్యయనం తేలి్చంది.
కేంద్ర ఆరోగ్య శాఖ
ప్రకారం దేశంలో ఏటా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు (అంచనా)
సంవత్సరం కేసులు
2022 14.61 లక్షలు
2023 14.96 లక్షలు
2024 15.33 లక్షలు
2025 15.62 లక్షలు


