జనవరి సెషన్‌కే 14.50 లక్షలకు పైగా నమోదు
గత ఏడాది కంటే లక్షకుపైగా అధికం
ఏప్రిల్ సెషన్‌తో కూడా కలిపితే 17లక్షలు వచ్చే అవకాశం
21 నుంచి తొలి సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్–2026 జనవరి ఒక్క సెషన్‌కు మాత్రమే 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది గత ఏడాది జనవరి సెషన్ కంటే లక్షకుపైగా ఎక్కువ. ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి రెండు సెషన్లు కలిపి 17లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోందని చెబుతున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్‌కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అంటే, ఈసారి రెండు సెషన్లలోనూ భారీగా పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. ఈ వారంలో విద్యార్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేయనుంది. మూడో వారంలో అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.


