
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.
తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో బస చేశారు. రూమ్‌లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు.
