బాబు మార్కు కనికట్టు! | Chandrababu coalition govt making deals for solar power with high prices | Sakshi
Sakshi News home page

బాబు మార్కు కనికట్టు! రూ.2.49 కంటే రూ.3.20 చవకా?

Aug 17 2025 5:17 AM | Updated on Aug 17 2025 10:08 AM

Chandrababu coalition govt making deals for solar power with high prices

రూ.2.49 కంటే రూ.3.20 చవకా?

యూనిట్‌కు రూ.3.20 చొప్పున సోలార్‌ విద్యుత్‌ 

ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎకోరాన్, వృద్ధిమాన్, భవ్య సంస్థలకు టెండర్ల ఖరారుకు రంగం సిద్ధం 

ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 5,983.5 ఎకరాలు సిద్ధం 

రాష్ట్రంలో ఓ వైపు మిగులు విద్యుత్‌ ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం? 

రోజువారీ డిమాండ్‌ 10–13 వేల మెగావాట్లు.. అందుబాటులో 14 వేల మెగావాట్లు 

పైగా ఇప్పటికే 23 వేల మెగావాట్ల కోసం విద్యుత్‌ సంస్థల ఒప్పందాలు  

అత్యంత చవకగా యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్న గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 

దీనిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? 

అంతకంటే ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారు?

రూ.2.49 ఎక్కువ ధర అని.. భారీగా అవినీతి అంటూ ఎన్నికల ముంగిట దుష్ప్రచారం చేసిందెవరు?

చంద్రబాబు అండ్‌ గ్యాంగ్, ఎల్లో మీడియా నాడు కూడబలుక్కుని తప్పుడు ప్రచారం

ఇప్పుడు అంతకంటే ఎక్కువ ధరతో ప్రైవేటు సంస్థలతో పీపీఏల్లో ఆంతర్యమేంటి? 

భారీగా కమీషన్లు దండుకోవడం కాదా?

ఇప్పటికే యాక్సిస్‌తో యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలు ఒప్పందం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ) నుంచి యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధర ఎక్కువన్నారు.. 

పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తెస్తుంటే వద్దన్నారు.. 
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీల మినహాయింపుతో విద్యుత్‌ తీసుకుంటా మంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు.. 

కానీ, అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.20 చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సన్నాహాలు చేస్తున్నాయి. 

మరి ఈ పాలకులను ఏమనాలి? రెండు నాల్కల ధోరణి అనాలా? అవకాశవాదం అనాలా? ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లు అనాలా? అధిక ధర ముసుగులో కమీషన్లు కొట్టేసే కేటుగాళ్లు అనాలా?

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనిట్‌ సోలార్‌ విద్యుత్‌ రూ.2.49కే వస్తోందంటే నానా యాగీ చేసిన ఇదే కూటమి.. అధికారంలోకి రాగానే యూనిట్‌ విద్యుత్‌ను రూ.3.20 చొప్పున ప్రైవేటు సంస్థల నుంచి కొనేందుకు సిద్ధమైపోయింది. తమకొక న్యాయం.. ఎదుటి వాళ్లకు మరో న్యాయం అని నిస్సిగ్గుగా చెబుతూ బరితెగించింది. రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు ఉంటే, వీటిలో 3 లక్షల సర్వీసులకు సరిపోయేలా కుసుమ్‌ పథకం కింద 3,325 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం గల మినీ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తొలి దశలో 1,185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ ఏడాది మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. యూనిట్‌కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్‌ చేశారు. తాజాగా ఈ టెండర్ల ధరలను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం.. యూనిట్‌కు రూ.3.19 నుంచి రూ.3.20 మధ్య ఇవ్వనున్నారు. ఎకోరాన్‌ కంపెనీకి యూనిట్‌కు రూ.3.18, వృద్ధిమాన్‌ సంస్థకు యూనిట్‌కు రూ.3.19, భవ్య కంపెనీకి రూ.3.20 చొప్పున టెండర్లను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. 

నిజానికి వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా అందించేందుకు గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా అమలులోనే ఉంది. దాని ప్రకారం ఇంతకంటే తక్కువ ధరకు సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దానిని కాదని, పొలాల వద్ద మినీ సోలార్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి సౌర విద్యుత్‌ బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకే వస్తోంది. 

అప్పనంగా 5,983.5 ఎకరాలు ధారాదత్తం
మినీ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ఈ డిస్కం గుర్తించింది. 

ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ (ఏపీసీపీడీసీఎల్‌) పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు 1,842 ఎకరాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా, దీని కోసం 1,086.5 ఎకరాలు గుర్తించారు. మొత్తంగా 5,983.5 ఎకరాలను సిద్ధం చేశారు. 

మిగులు ఉండగా కొత్తవి ఎందుకు?
రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రిడ్‌ గరిష్ట డిమాండ్‌ 13 వేల మెగావాట్లు మించి లేదు. అది కూడా వేసవి వంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే. మిగతా ఏడాదంతా 10 వేల మెగావాట్లలోపే విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతోంది. భవిష్యత్‌ అవసరాల కోసం, డిమాండ్‌ భారీగా పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకంటూ ఇప్పటికే డిస్కంలు 23 వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ప్రస్తుతం సుమారు 14 వేల మెగావాట్ల విద్యుత్‌ సమకూరుతోంది. 

అంటే డిమాండ్‌కు అవసరమైన విద్యుత్‌ కంటే ఎక్కువగానే విద్యుత్‌ అందుబాటులో ఉంది. దీంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని అనేకసార్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి మిగులు విద్యుత్‌ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా, ఇంకా అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

అధికారం చేతికి రాగానే దోపిడీ
చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి ఉపక్రమించారు. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన యూనిట్‌ రూ.4.60 చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ 400 మెగావాట్ల పునరుత్పాదక (పవన–సౌర హైబ్రీడ్‌) విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించి, వాటి నుంచి పాతికేళ్ల పాటు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు విద్యుత్‌ను విక్రయించేలా ఏర్పాటు చేశారు.



⇒ వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గతంలో చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న పీపీఏల వల్ల విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని గుర్తించి, వాటిని పునఃపరిశీలించాలని భావించింది. ఆ క్రమంలోనే యాక్సిస్‌ పీపీఏలను పక్కన పెట్టింది. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పట్టాలెక్కించారు చంద్రబాబు. తాను సగంలో ఆపేసిన దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్కెట్‌లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ, రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. 

⇒ భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్‌ ధరలు తగ్గుతాయని, కావున సోలార్‌ ఎనర్జీ కార్పొరేష­న్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి యూనిట్‌ రూ.­2.49తో సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడం భార­మని వాదించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మినీ సోలార్‌ ప్రాజెక్టుల పేరుతో రూ.3.20తో యూనిట్‌ కొనుగోలుకు సిద్ధమైపోయింది.

సబ్సిడీ ఎగ్గొట్టే కుట్ర
మినీ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సమస్య వచ్చి, ఆ సంస్థలు ఎదురు తిరిగితే రైతులకు ఈ కేంద్రాల నుంచి విద్యుత్‌ లభించకపోవచ్చు. అప్పుడు వారికి విద్యుత్‌ ఎలా అందిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీల కోసం డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లు అందించింది. అదే టీడీపీ గత హయాంలో 2014–19 మధ్య ఐదేళ్లకు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. పైగా రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దానిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 

చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్‌ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామర్థ్యాన్ని గత ప్రభుత్వం పెంచింది. 

ఇప్పుడు వాటి వద్దనే టీడీపీ ప్రభుత్వం సోలార్‌ ప్లాంట్లు పెట్టిస్తామంటోంది. ఇదంతా వ్యవసాయానికి ఇప్పుడు ఇస్తున్న దాదాపు రూ.12 వేల కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘సెకీ’ ఒప్పందంపై ఎన్నో కుట్రలు 
⇒ రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి 17 వేల మిలి­యన్‌ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవకగా.. యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. 

⇒ 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. 

⇒ సౌర విద్యుత్‌ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్‌టీఎస్‌)ల నుంచి మినహాయింపు వస్తుందని చెప్పింది. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్‌ ఒప్పందాలకు అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సైతం ఆదేశాలిచ్చింది. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్‌ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) కూడా స్పష్టం చేసింది.

⇒ చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్‌ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్‌టీఎస్‌ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేశారు. చంద్రబాబు అండ్‌ గ్యాంగ్, ఎల్లో మీడియా సెకీ ఒప్పందంపై విషం గక్కా­యి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని ప్రయత్నించాయి. 

⇒ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ని­యంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పటా­పంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే బా­బు ప్రభుత్వం అదే సౌర విద్యుత్‌ను యూనిట్‌­కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవి­నీతి దాగుందో ప్రత్యేకించి చెప్పనవ
సరం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement