ఉత్కంఠతో  మొదలై ఉసూరుమనిపించి..  | Donald Trump-Vladimir Putin summit ends without concrete deal | Sakshi
Sakshi News home page

ఉత్కంఠతో  మొదలై ఉసూరుమనిపించి.. 

Aug 17 2025 5:32 AM | Updated on Aug 17 2025 5:32 AM

Donald Trump-Vladimir Putin summit ends without concrete deal

నిష్ఫలంగా ముగిసిన ట్రంప్, పుతిన్‌ చర్చలు 

జాయింట్‌ బేస్‌ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్‌(అలాస్కా): ఎడాపెడా టారిఫ్‌ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్‌ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి.

 దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్‌పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్‌లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్‌ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్‌దే పైచేయి కనిపించింది. 

అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్‌ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది.  

పుతిన్‌పై ప్రశ్నల శరాలు 
తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్‌ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్‌కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్‌ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్‌కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్‌ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్‌ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. 

సాదర స్వాగతం పలికిన ట్రంప్‌ 
పుతిన్‌ కంటే ముందే యాంకరేజ్‌ సిటీలోని ఎయిర్‌పోర్ట్‌కు ట్రంప్‌ చేరుకున్నారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పుతిన్‌కు ట్రంప్‌ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్‌కార్పెట్‌పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్‌ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్‌–22 ఫైటర్‌జెట్‌లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్‌ తన బీస్ట్‌ కారులో పుతిన్‌ను ఎక్కించుకున్నారు. 

మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్‌ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్‌ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్‌ ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్‌ల సమక్షంలో ట్రంప్, పుతిన్‌లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్‌పై దాడులు మొదలెట్టాక పుతిన్‌ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.

అమెరికా మా పొరుగు దేశం 
భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్‌ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్‌కార్పెట్‌పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్‌ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్‌) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్‌ చర్చిలు ఉన్నాయి. 

మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్‌ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని పుతిన్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్‌ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది.

 ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్‌కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్‌ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్‌తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్‌ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్‌ స్పష్టంచేశారు.

నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం 
తర్వాత ట్రంప్‌ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్‌తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్‌ వల్లే సాధ్యం. 

ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్‌తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్‌ అన్నారు. దీంతో వెంటనే పుతిన్‌ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో పలు పోస్ట్‌లు పెట్టారు.

 ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్‌తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్‌స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్‌ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement