
అలాస్కాలో అడుగుపెట్టింది మొదలు వెళ్లేదాకా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పుతిన్
యుద్ధం, శాంతి, కాల్పుల విరమణ పదాలను మాటవరసకైనా ప్రస్తావించని ట్రంప్
ఉక్రెయిన్‌పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి
అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్‌లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు.
సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్‌తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.
ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు
ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్‌కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది.
కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్‌కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు.
ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్‌తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.
కాల్పుల విరమణ.. గప్‌చుప్
ఉక్రెయిన్‌తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్
ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్‌లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్‌కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు.
శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్
యుద్ధం ఆపాలన్న డిమాండ్‌తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్‌లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్‌తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు.
పదికి పది.. కానీ సున్నా
సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్‌ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌తో కరచాలనం, రెడ్‌కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు.
సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్