
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు.