
ట్రంప్–పుతిన్‌తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు
అవకాశాలను కొట్టిపారేయని వైట్‌హౌస్
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్‌కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్‌ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు లేదు. అయితే, జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి.
ట్రంప్–పుతిన్‌ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్‌స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
యూరప్ నేతల డిమాండ్లివీ..
అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్‌స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్‌ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్‌స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్‌స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు.
అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్‌కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు.
ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్‌తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్‌బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు.