ఆసియా పసిఫిక్‌లో కీలకంగా భారత్‌  | India and China driving air traffic growth in Asia Pacific region says AAPA DG | Sakshi
Sakshi News home page

ఆసియా పసిఫిక్‌లో కీలకంగా భారత్‌ 

Nov 16 2025 5:08 AM | Updated on Nov 16 2025 5:08 AM

India and China driving air traffic growth in Asia Pacific region says AAPA DG

విమానయాన వృద్ధిలో చైనాది కూడా ప్రధాన పాత్ర 

తొలి 9 నెలల్లో ప్రాంతీయంగా 10% పెరిగిన ఎయిర్‌ ట్రాఫిక్‌ 

ఏఏటీఏ వెల్లడి

బ్యాంకాక్‌: ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో విమానయాన రంగ వృద్ధికి భారత్, చైనా కీలకంగా నిలుస్తున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఆసియా పసిఫిక్‌ ఎయిర్‌లైన్స్‌ (ఏఏపీఏ) వెల్లడించింది. ప్యాసింజర్, కార్గోలకు డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో 2026లో కూడా పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఏఏపీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుభాష్‌ మీనన్‌ తెలిపారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ 10 శాతం పెరిగిందని వివరించారు. 

2025 తొలి ఆరు నెలల్లో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికుల సంఖ్య 16 శాతం వృద్ధి చెందిందని 69వ అసెంబ్లీ ఆఫ్‌ ప్రెసిడెంట్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌ విస్తరించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. 

చారిత్రకంగా చూస్తే భారతీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా చాలా కీలకమైనదని, అది నిలదొక్కుకోవడానికి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని మీనన్‌ చెప్పారు. సరఫరా వ్యవస్థపరంగా అంతరాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆసియా పసిఫిక్‌ ఎయిర్‌లైన్స్‌ డిమాండ్‌కి తగ్గ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయ న పేర్కొన్నారు. ఏఏపీఏలో ఎయిరిండియా సహా 18 విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. 

నాలుగు తీర్మానాల ఆమోదం.. 
సదస్సు సందర్భంగా ఏఏపీఏ నాలుగు తీర్మానాలను ఆమోదించింది. సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లను అధిగమించడం, విమానాల్లో లిథియం బ్యాటరీలను తీసుకెళ్లడం, పన్నులు..చార్జీలు, పర్యావరణహితమైన విధంగా ఏవియేషన్‌ కార్యకలాపాలు సాగించడంలాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ప్రాంతీయంగా ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌) కార్యకలాపాలు పెరిగేలా నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవడం, తయారీ సామర్థ్యాలు పెంచుకునేందుకు ఊతమివ్వడం, నిర్దిష్ట పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఏఏపీఏ కోరింది. అలాగే పునరి్వనియోగానికి పనికొచ్చే ఎయిర్‌క్రాఫ్ట్‌ మెటీరియల్స్‌ను రీసైకిల్‌ చేసేలా సర్క్యులర్‌ ఎకానమీ విధానాలను అమల్లోకి తేవొచ్చని పేర్కొంది.  

ఎయిర్‌లైన్స్‌కి అండగా ఉండాలి: ఐఏటీఏ 
సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లతో విమానాల డెలివరీలకు అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌కి విమానయాన పరిశ్రమలోని వివిధ విభాగాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్‌‡్ష తెలిపారు. టారిఫ్‌లు, ఇతరత్రా అంశాల కారణగా విమానాల తయారీ సంస్థలు (ఓఈఎం) ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్‌ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని, మరోవైపు ఓఈఎంల మార్జిన్లు  అధిక స్థాయిలో ఉంటాయని వాల్‌‡్ష తెలిపారు. మిగతా వర్గాలు లాభాలార్జించడంపై తమకే అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో సమతౌల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సరఫరా వ్యవస్థపై టారిఫ్‌లు ప్రతికూల ప్రభావం చూపుతాయని సుభాష్‌ మీనన్‌ చెప్పారు. వీటి వల్ల విమానయాన సంస్థల ఇంధనేతర వ్యయాలు కూడా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్‌ల వల్ల ఇటు సరఫరా, అటు డిమాండ్‌ మీద ప్రభావం పడుతుందన్నారు. కన్సలి్టంగ్‌ సంస్థ ఆలివర్‌ వైమాన్‌తో కలిసి ఐఏటీఏ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సరఫరా వ్యవస్థ సవాళ్ల కారణంగా 2025లో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమపై 11 బిలియన్‌ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. అక్టోబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంధనం అధికంగా వాడాల్సి రావడం, అదనపు మెయింటెనెన్స్, మరింత ఎక్కువగా ఇంజిన్లను లీజుకు తీసుకోవడంలాంటి అంశాలపై విమానయాన సంస్థలు గణనీయంగా వెచి్చంచాల్సి రానుంది. 

20 ఏళ్లలో 19,560 విమానాలు అవసరం: ఎయిర్‌బస్‌ అంచనాలు 
వచ్చే 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 19,560 చిన్న, పెద్ద విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ వెల్లడించింది. అంతర్జాతీయంగా 20 ఏళ్లలో 42,520 విమానాలు అవసరం కానుండగా, ఇది అందులో దాదాపు సగమని వివరించింది. భారత్, చైనాలో విమానయానానికి డిమాండ్‌ పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్‌బస్‌ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ స్టాన్లీ చెప్పారు. ప్రాంతీయంగా ప్యాసింజర్ల సంఖ్య ఏటా 4.4 శాతం వృద్ధి చెందనుందని, ఇది అంతర్జాతీయ సగటు 3.6 శాతం కన్నా అధికమని వివరించారు. ఆసియా–పసిఫిక్‌లో సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని స్టాన్లీ పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, నెట్‌వర్క్‌ విస్తరణ, చౌక విమానయాన సంస్థల రాక, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం మొదలైనవి విమానయాన వృద్ధికి దోహదపడే అంశాలని చెప్పారు.

కొత్తతరం విమానాలతో 25 శాతం ఇంధనం ఆదా.. 
తమ కొత్త తరం వైడ్‌–బాడీ విమానాలు 25 శాతం మేర ఇంధనాన్ని ఆదా చేస్తాయని, కర్బన ఉద్గారాలను కూడా ఆ మేరకు తగ్గిస్తాయని ఎయిర్‌బస్‌ తెలిపింది. ఏఏపీఏ సదస్సు సందర్భంగా ఎయిర్‌బస్‌ వెల్లడించిన అంచనాల ప్రకారం ఆసియా పసిఫిక్‌లో వచ్చే రెండు దశాబ్దాల్లో 3,500 పెద్ద విమానాలు అవసరం కానున్నాయి. ఇది అంతర్జాతీయంగా పెద్ద విమానాలకున్న డిమాండ్‌లో సుమారు 43 శాతం. మరోవైపు, ప్రాంతీయంగా 16,100 చిన్న విమానాలు కావాల్సి ఉంటుంది. గ్లోబల్‌ డిమాండ్‌లో దాదాపు 47 శాతం. దాదాపు 32 శాతం విమానాలు పాత మోడల్స్‌ స్థానాన్ని భర్తీ చేయనుండగా, మిగతావి ఫ్లీట్‌ విస్తరణకు ఉపయోగపడనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement