
దేశంలో ఎన్‌సీఆర్ తర్వాత మనదే ఖరీదైన నగరం
విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు పెరిగిన ఆసక్తి
రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర గృహాల కొనుగోలు
జనవరి–జూన్ మధ్య 30,553 యూనిట్ల అమ్మకం
ఇందులో 35 శాతం వాటా లగ్జరీ గృహాలదే
క్రెడాయ్– సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్‌లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
లగ్జరీదే మూడో వంతు వాటా..
నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది.
ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల..
కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్‌సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్ అవతరించింది.
అందుబాటు ఇళ్ల కొరత..
నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్‌పూర్, ఘట్‌కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది.