
సాక్షి, వైఎస్సార్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై తనకు కుర్చీవేయలేదని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. తనకు వేదికమీద చోటు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై గుడ్లురిమి కేకలేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తాజాగా మాట్లాడుతూ.. వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తిరిగి వెళ్లిపోయారు. అన్నీ ప్రోటోకాల్ ప్రకారమే చేశాం. స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభమైన గంటన్నర తర్వాత ఎమ్మెల్యే వచ్చారు. వచ్చే ముందు ఎమ్మెల్యే కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఫలితంగా వీఐపీలకు కేటాయించిన సీట్లకు ఇతరులు కూర్చున్నారు. వెంటనే వారిని లేపి రెవెన్యూ అధికారి ఎమ్మెల్యేని పిలిచి.. వీఐపీ సీట్లో ఆమెను కూర్చోవాలని కోరారు. అందుకు ఆమె విముఖత చూపారు. ముందుగానే వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకోసం మేం ఆమెకు వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించాం. వేదికపైకి రావాలని జాయింట్ కలెక్టర్, తాను వెళ్లి ఆహ్వానించినా రాలేదని స్పష్టం చేశారు. అయినా ఆమె వేదికపైకి రాకుండా వెళ్లిపోయారు. ఆమెకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మేమంతా ప్రోటోకాల్ ప్రకారమే చేశాం’ అని చెప్పుకొచ్చారు.
ఇక, ఎమ్మెల్యే తీరును ఇప్పటికే జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తప్పుపట్టింది. వేదికపైకి ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్‌పై పరుషంగా వ్యవహరించడం కడప జిల్లాకే అవమానకరం. కుర్చీ వేయలేదని రుసరుసలాడటం అత్యంత హేయమైన చర్య. ఉన్నతాధికారులతోనే ఇలా వ్యవహరిస్తే ఇక కింది స్థాయి ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కుర్చీ కోసం దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను అసోసియేషన్ కోరింది.
