
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం వాషింగ్టన్‌లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్‌కు రావాలంటూ ఆహా్వనించినందుకు ట్రంప్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్‌తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉక్రెయిన్–రష్యా సంఘర్షణకు తెరతించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతోపాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు.