
స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే..
ప్రపంచంలోనే మొట్టమొదటి 'గర్భధారణ రోబోట్'పై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని, ఇది సజీవ శిశువుకు జన్మనిస్తుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఈ టెక్నాలజీ గర్భధారణ నుంచి ప్రసవం వరకు గర్భధారణకు కావలసిన అన్ని విషయాలను అనుకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
పిండం అనేది గర్భధారణ రోబో.. కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. పిండాలకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. అయితే అండం, స్పెర్మ్ ఎలా.. ఎక్కడ ఫలదీకరణం అవుతుందనే విషయాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ 'జాంగ్ కిఫెంగ్' నేతృత్వంలోని గ్వాంగ్‌జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది.
ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఈ టెక్నాలజీ విజయవంతమైతే.. సంతానం లేని జంటలకు లేదా జీవసంబంధమైన గర్భధారణ చేయించుకోవడానికి ఇష్టపడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరిణతి చెందిన దశలో ఉందని డాక్టర్ జాంగ్ పేర్కొన్నారు. పిండం.. రోబోట్ కృత్రిమ గర్భంలో పెరగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ రోబోట్ నమూనా 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
మనిషి గర్భంతో పనిలేకుండా రాబోయే టెక్నాలజీ బాగానే ఉంది. కానీ ఇది ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తల్లి, బిడ్డల పేగు బంధం లేకపోతే.. పిల్లల మానసిక ప్రభావం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఇది చట్టపరంగా సాధ్యమేనా?, చట్టాలు దీనికి ఒప్పుకుంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.