
జైళ్లలో నిఘా లోపాలను బయటపెట్టిన వ్యవహారం
ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్ రఫీ అనే అంతర్ జిల్లా దొంగ, వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం.
తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్ అమర్ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్ బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్ జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది. ప్రహరీ చుట్టూ విద్యుత్ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది.