
కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు.
‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.
కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది.
మంచులో స్లెడ్జ్ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది.
దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!
జపాన్ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది.
ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు.
తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్ లో ఎదురుచూసింది. జపాన్ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.
ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు.
కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ నవలలోని బక్ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది.
ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్ మే రాసిన ‘ఇంటర్వెన్షన్ ’). ‘పాతాళ్ లోక్’ వెబ్‌సిరీస్‌లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట.
మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా!