
కాళేశ్వరం లేదని చెప్పడం అంటే.. బనకచర్లకు మద్దతివ్వడమే: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్‌లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్‌లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.
కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు.