
న్యూఢిల్లీ: సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 86వ ర్యాంకర్ తాన్యా 15–10, 15–8తో కానాయ్ సకాయ్ (జపాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తాన్యా తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో గెలుపొందింది. 21 ఏళ్ల తాన్యాకు ఇది నాలుగో అంతర్జాతీయ టైటిల్.
అంతకుముందు ఇండియా ఇంటర్నేషనల్ (2022), ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ (2023), బెండిగో ఇంటర్నేషనల్ (2024)లో తాన్యా టైటిల్స్ గెలుచుకుంది. గతేడాది అజర్‌బైజాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో భారత షట్లర్ మాళవిక బన్సోద్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
తాజా టోర్నీలో తాన్యా... సెమీఫైనల్లో రిరినా హిరామొటో (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో లీ జిన్ యీ మెగన్ (సింగపూర్)పై, ప్రిక్వార్టర్స్‌లో నొడొకా సునకవా (జపాన్)పై విజయాలు సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ట్రయల్స్‌లో భాగంగా... ఈ టోర్నమెంట్‌లో ఒక్కో గేమ్‌లో 21 పాయింట్లకు బదులు 15 పాయింట్లుగా నిర్వహించారు.