
బతుకుదెరువుకోసం దుబాయ్‌కి వెళ్లి మోసపోయిన తెలుగువారు
కాపాడాలంటూ వేడుకుంటున్న కుటుంబ సభ్యులు
వెల్గటూర్: బతుకుదెరువు కోసం ఎడారి దేశం వెళ్లిన తొమ్మిది మంది తెలుగువారు అక్కడ ఓ ముఠా చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణవారు కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తమను కాపాడి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపించాడు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్‌ఎల్‌సీ కంపెనీలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. అతడితోపాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పనికి కుదిరారు. అక్కడ వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పగా.. అతడి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది అతడితో ఓ ప్రదేశానికి వెళ్లారు.
అక్కడ ఆ ముఠా సభ్యులు వీరి నుంచి ఐడీ కార్డులు, సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 5న విడిచిపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిరణ్‌తోపాటు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని విడిచి పెట్టారు. మిగిలిన ఏడుగురిని పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారంటూ కిరణ్ సెల్ఫీ వీడియో తీసి అతని స్నేహితులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డికి పంపించారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ తెలిపాడు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన అశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. పొట్ట కూటికి ఆశపడి పొరుగు దేశం వెళ్లి మోసపోయిన తమవారిని ప్రభుత్వం ఆదుకొని ఇండియాకు తీసుకురావాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.