సాక్షి, అన్నమయ్య: కూటమికి ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు రాయచోటి ప్రజలను గుండెకోతకు గురిచేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారని అన్నారు. పక్క ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
అన్నమయ్య జిల్లా తరలింపుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పినా సంబరాల పేరిట ప్రజలను ఏమార్చారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నాం, మా వాదనలు వినిపించాను. నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయపోరాటం ఒకటే మార్గం. జన గణన ప్రారంభమవుతుంది ఈ లోపల సరిహద్దులు మార్చకూడదనే నిబంధన కూడా ఉంది. ఉన్న జిల్లాను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు, ఈ ప్రాంత ప్రజలను కోతకు గురి చేశారు.
ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేరు. జిల్లా కేంద్రం నుంచి చుట్టూ ముప్పై కిలోమీటర్ల వరకు లక్షల కోట్ల మా సంపదను ఆవిరి చేసి నష్టం చేశారు. ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు. రైతులను వ్యాపారులను యువతను అన్ని విధాల మోసం చేశారు. మమ్మల్ని గుండు కోతకు గురి చేసిన ఓ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుత తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుంది.
జన గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాల విభజన జరిగి ఉంటే స్వాగతించే వాళ్లం. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి అన్ని ప్రాంతాల పెట్టుబడులన్నీ ఒక అమరావతిలోనే పెడుతున్నారు చంద్రబాబు. 100 కోట్లతో రాయచోటి కలెక్టరేట్ తయారవుతుంది. కానీ 1800 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో తిరిగేందుకు విహారయాత్రలు చేసుకునేందుకు వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని మంత్రులు మాట్లాడుతున్నారు. 5000 కోట్లతో బనకచర్ల, గండికోట పనులు గతంలో ప్రారంభించాం. రాయచోటిని జిల్లా చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాం. జిల్లా తీసుకు వస్తాం. ఈ ప్రాంతానికి వచ్చిన సైనిక్ స్కూల్, యునాని మెడికల్ కాలేజ్, జిల్లా కేంద్రం తరలిపోవడం బాధాకరం.
రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటే ఏ విధంగా కట్టుబడి ఉన్నారు?. రాయచోటిలో యూనివర్సిటీ కోసం, కలెక్టరేట్ కోసం, జడ్పీ కార్యాలయం కోసం వేలాది ఎకరాలు కేటాయించి పెట్టాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నమయ్య జిల్లా పేరు మీదే వచ్చింది. అందుకే అన్నమయ్య జిల్లాపై కుట్ర పన్నారు. గతంలో అమరావతి రాజధాని చేస్తామంటే వైఎస్సార్‌సీపీ అభ్యంతరం చెప్పలేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా అమరావతి కూడా ప్రతిపాదించాం. అమరావతి కోసం 50 వేల ఎకరాలు తీసుకుంటే చనిపోయిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఘాటు విమర్శలు చేశారు.


