రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు నిర్దిష్ట గడువు నిర్దేశించలేవు
లోటుపాట్లు ఉంటే రాజ్యాంగ ప్రక్రియ ద్వారా సరిదిద్దాలి
ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం తగదు
సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక వివరణ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించి, పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు నిర్దిష్ట గడువు(టైమ్‌లైన్) విధించడం వల్ల రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బిల్లులకు సమ్మతి తెలియజేసే లేదా తిప్పి పంపించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ గడువు విధిస్తే రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని, గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని అభిప్రాయపడింది.
రాష్ట్రపతి, గవర్నర్ల విధుల్లో లోటుపాట్లు ఉంటే, వారు సక్రమంగా స్పందించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరైంది కాదని వెల్లడించింది. రాజ్యాంగపరమైన ప్రక్రియ ద్వారా ఆ లోటుపాట్లు సరిదిద్దాలని తెలియజేసింది. సమ్మతి కోసం రాష్ట్రాల అసెంబ్లీల నుంచి వచ్చిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించవచ్చా? అనే దానిపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ నోటీసులు జారీ సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇటీవల లిఖితపూర్వక వివరణను సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఈ వివరణలో కేంద్రం ఏం చెప్పిందంటే...
రాజ్యాంగ రూపకర్తలు అవి ఆశించలేదు
‘‘ప్రభుత్వంలో భాగమైన ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు అప్పగించని విధులు నిర్వర్తించాలని చూస్తే అది చివరకు రాజ్యాంగపరమైన గందరగోళానికే దారితీస్తుంది. ఒక వ్యవస్థ విఫలమైతే లేదా ని్రష్కియాత్మకంగా వ్యవహరిస్తే లేదా పొరపాట్లు చేస్తే... మరో వ్యవస్థ అందులో కలుగుజేసుకోవడం తగదు. ఒక వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను మరో వ్యవస్థ చెలాయించడం చెల్లదు. రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలకు వాటికంటూ ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు లేదా సంస్థల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైన సందర్భాల్లో కూడా ఒక వ్యవస్థకు లేని అధికారాలు చెలాయించడానికి అనుమతి ఇస్తే రాజ్యాంగపరమైన విపరిణామాలే సంభవిస్తాయి.
లేని అధికారాలను కల్పించడం లేదు
రాజ్యాంగం మన దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థిరపర్చింది. వ్యవస్థల మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు విధిస్తే గనుక ఆ సమతౌల్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. రాజ్యాంగంలోని అర్టికల్ 142 అనేది కోర్టులకు లేని అధికారాలను కల్పించడం లేదు. రాజ్యాంగ, శాసన
విభాగాల బాధ్యతలు, అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. రాష్ట్రపతి, గవర్నర్లది రాజకీయంగా అత్యున్నత స్థాయి.
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ..
ఆరి్టకల్ 200, 201లు రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలాంటి టైమ్‌లైన్ విధించడం లేదు. బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యామ్నాయాల గురించి మాత్రమే అవి చెబుతున్నాయి. రాజ్యాంగానికి లోబడి ఒక వ్యవస్థను మరో వ్యవస్థ అదుపు చేసే విధానం(చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ఉన్నప్పటికీ అదే రాజ్యాంగం ప్రకారం సమాజంలో మూడు మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వహక, న్యాయ విభాగాలకు వాటికే సంబంధించిన ప్రత్యేక అధికారాలు (జోన్లు) ఉంటాయి. మరో విభాగం అందులో వేలుపెట్టలేదు. రాష్ట్రపతి, గవర్నర్లకు సైతం వారికే ప్రత్యేకమైన అధికారాలు, అత్యున్నత హోదాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’.


