
‘‘పరదా’ కోసం మేం సృష్టించిన ఊరు, సంస్కృతి, పాత్రలన్నీ కల్పితాలే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా సినిమాకు అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. అయితే డబ్బులు వస్తే, ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు మరింతమంది నిర్మాతలు ముందుకొస్తారు. అందుకని వసూళ్లు బాగుండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్ కాండ్రేగుల. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ–‘‘నా తొలి చిత్రం ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసిన విజయ్‌గారికి ‘పరదా’ కథ చెప్పగా, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత అనుపమ గారికి కథ వినిపించగా ఎమోషనల్ అయ్యారు. ఆ నెక్ట్స్ దర్శన, సంగీతగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఓ ఊర్లో మహిళలందరూ ఎందుకు పరదాలు ధరిస్తారనే విషయాన్ని సినిమా స్టార్టింగ్‌లోనే చెప్పాం. ఆడవాళ్లలోనే కాదు... మగవాళ్లల్లో కూడా ఒక పరదా ఉంటుందని ఈ ‘పరదా’తో చెప్పే ప్రయత్నం చేశాం.
‘హైవే’ సినిమాలో ఆలియా భట్‌గారి నటకు నేను పెద్ద అభిమానిని. ‘పరదా’లో ఆలియా స్థాయి నటను అనుపమ చేశారు. దర్శన, సంగీతగార్లు బాగా యాక్ట్ చేశారు. గోపీసుందర్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మృదుల్ సేన్ అనే అమ్మాయి అద్భుతమైన విజువల్స్‌ను అందించారు. ‘సినిమాబండి, శుభం, పరదా’లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాకు కమర్షియల్ సినిమాలపై కూడా మంచి గ్రిప్ ఉంది. చాన్స్ వస్తే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు.