
స్వీట్స్, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు
ఆకట్టుకునే రంగుల వెనుక రసాయనాలు
ప్యాక్‌లపై అస్పష్టంగా కలరెంట్స్ సమాచారం
అధికంగా వాడితే ముప్పు తప్పదంటున్న వైద్యులు
స్వీట్ షాపునకు వెళ్తే ప్రకృతిలోని అన్ని రంగులూ అక్కడే ఉన్నాయా అన్నట్టు ఉంటుందా దృశ్యం. రెస్టారెంట్ల విందు భోజనమూ ఇందుకు ఏమీ తీసిపోదు. పుత్తడిని తలదన్నేలా మెరిసే జిలేబీలు మొదలు.. కుంకుమ పువ్వు దట్టించినట్టు కనిపించే బిర్యానీల వరకు.. భోజన ప్రియుల జిహ్వకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నోరూరించే రంగు రంగుల ఆహార పదార్థాల వెనుక ఉన్న రసాయనాలు ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఇంటి వంటకాలైతే రోజులో కొన్ని రకాలే చేయగలం. అదే బయటి ఫుడ్ అయితే మనకు నచ్చినన్ని కొనుక్కోవచ్చు. ఇంటి పట్టున ఉండే ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఫుడ్ చేతికందుతోంది. జనంలో ఆహారపుటలవాట్లు మారడం, ఆదాయాలు పెరగడం బయటి ఫుడ్ వినియోగానికి ఆజ్యం పోస్తున్నాయి. రెస్టారెంట్, వీధి బండ్లపై విక్రయించే ఫుడ్‌కు జనం అలవాటు పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేలా సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ (ఎస్‌ఎఫ్‌సీ) వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.
పరిమితి మించితే ముప్పే
సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ వాడకం పరిమితికి మించితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఎనిమిది సింథటిక్ ఆహార రంగులను అనుమతిస్తోంది. ఆహార ఉత్పత్తిని బట్టి వీటి వినియోగ పరిమితులు ఉంటాయి. ఇవి నిర్దేశించిన పరిమితుల్లో ఉపయోగిస్తే ఎటువంటి సమస్యా లేదు.
పరిమితికి మించి లేదా దీర్ఘకాలిక వినియోగమే ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా నియంత్రణ లేని అనధికారిక ఆహార విక్రేతల నుంచి కొనుగోలు చేసిన ఆహారమే ప్రమాదాలకు కారణం అవుతోందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, సున్నితత్వం ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండడమే మేలని వారు సూచిస్తున్నారు.
అవయవాలపైనా ప్రభావం
ఈ సింథటిక్ రంగులు వాడితే ఆహార పదార్థాలు ఆకట్టుకునేలా ఉంటాయి. వేడి, వెలుతురులోనూ రంగు స్థిరంగా ఉంటుంది. ధర కూడా తక్కువ. అందుకే ఆహార పదార్థాల విక్రేతలు వీటిని విరివిగా, పరిమితికి మించి ఈ రసాయన రంగులను వాడుతున్నారు. ఎంత పరిమాణంలో రంగులు వాడారన్న విషయమూ వినియోగదార్లకు తెలియదు. కొన్ని సింథటిక్ ఫుడ్ కలరెంట్స్‌ను దీర్ఘకాలం, అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో అధిక చురుకు వంటి ప్రవర్తనా సమస్యలు, అలర్జీ, లేదా అవయవాలు చెడిపోయే ప్రమాదమూ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెరుగైన పర్యవేక్షణకుతోడు ఈ రంగుల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉందని సూచిస్తున్నారు.
అస్పష్టమైన సమాచారం
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో వినియోగించిన సింథటిక్ రంగుల వివరాలను కంపెనీలు వెల్లడించిన తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఎన్ ఎస్ 110, ఈ 129, అనుమతి పొందిన రంగు.. ఇలాంటి పేర్లతో కంపెనీలు రంగుల వివరాలను ప్యాక్‌లపై ముద్రిస్తాయి. సగటు భారతీయ వినియోగదారునికి ఇటువంటి సమాచారం అర్థం చేసుకోవడం కష్టం.
వీధుల్లో, రోడ్లపై విక్రయించే స్నాక్స్, మిఠాయిలు, లేదా రెస్టారెంట్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో వినియోగించే కృత్రిమ రంగుల వివరాలను తెలిపే విధానమే లేదు. దుకాణాల్లో అమ్మే వస్తువులన్నీ సురక్షితమన్న భావన చాలా మంది వినియోగదారుల్లో ఉంది. అయితే కొన్ని బ్రాండ్లు, రెస్టారెంట్లు శుభ్రమైన, మొక్కల ఆధారిత రంగులతో ఆహార పదార్థాలు రూపొందించడం శుభపరిణామం.
రంగుల మాయ
కృత్రిమ రంగులు, వినియోగించే వస్తువులు, అధిక వాడకం వల్ల వచ్చే సమస్యలు
1 టార్‌ట్రాజిన్ (ఈ 102/ఐఎన్ ఎస్ 102) వినియోగం: పసుపు వర్ణంలో ఉండే స్వీట్స్, చిప్స్, శీతల పానీయాలు
సమస్యలు: పిల్లల్లో అధిక చురుకు, ఆస్తమా, చర్మ సమస్యలు
2 సన్ సెట్ యెల్లో ఎఫ్‌సీఎఫ్ (ఈ 110/ఐఎన్ ఎస్ 110)వినియోగం: పచ్చళ్లు, పళ్లరసాలు, సాసెస్, బేకరీ ఉత్పత్తులు
సమస్యలు: అలర్జీ, అధిక చురుకు, జీర్ణ సమస్యలు
3 కార్మోయిసిన్ (ఈ 122/ఐఎన్ ఎస్ 122)వినియోగం: జెల్లీస్, జామ్స్, సిరప్స్, స్వీట్స్
సమస్యలు: చర్మ సమస్యలు, అధిక చురుకు
4 ఇండిగో కార్మిన్ (ఈ 132/ఐఎన్ ఎస్ 132) వినియోగం: ఐస్‌క్రీమ్స్, క్యాండీస్
సమస్యలు: అలర్జీ, వికారం, అధిక రక్తపోటు
5 పాన్సో 4ఆర్ (ఈ 124/ఐఎన్ ఎస్ 124) వినియోగం: కేక్స్, బిస్కట్స్‌లో కోటింగ్, డిజర్ట్స్, సాసులు
సమస్యలు: ఆస్తమా, దద్దుర్లు
6 బ్రిలియంట్ బ్లూ (ఈ 133/ఐఎన్ ఎస్ 133)వినియోగం: శీతల పానీయాలు, పాల పదార్థాలు, స్వీట్స్
సమస్యలు: దద్దుర్లు, అలర్జీ, శ్వాస సమస్యలు
7 ఎరిథ్రోసిన్ (ఈ 127/ఐఎన్ ఎస్ 127) వినియోగం: కాండీడ్ ఫ్రూట్స్, కేక్ టాపింగ్స్, చెర్రీస్
సమస్యలు: థైరాయిడ్ సమస్యలు, డీఎన్ ఏకు నష్టం, అలర్జీ
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు
సంవత్సరం పరిశీలించిన శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాలు లేనివి పెట్టిన కేసులు
2024-25 1,94,116 34,388 31,407