బయట దొరకని నాణ్యమైన ఆహారం
అపరిశుభ్ర వాతావరణంలో తయారీ
రంగు, రుచి కోసం ప్రమాదకర రసాయనాల వినియోగం
పొంచి ఉన్న రోగాలు
హోటళ్లలో అధికారుల నామమాత్ర తనిఖీలు
ప్రస్తుత ఉరుకులు.. పరుగుల జీవనంలో అధిక శాతం మంది బయట లభించే ఆహారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రెస్టారెంట్లు సైతం ప్రజలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అయితే ఏదో ఒకట్రెండు మినహా మిగిలిన అన్ని చోట్ల లభిస్తున్న ఫుడ్ క్వాలిటీపై ప్రశ్నలు తలెత్తు తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో వంటల తయారీ.. ప్రమాదకర రసాయనాల వినియోగం ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, తూతూమంత్రపు తనిఖీలకే అధికారులు పరిమితమవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కొన్నేళ్ల క్రితం వరకు బయట ఆహారాన్ని ఎక్కువ మంది పెద్దగా తీసుకునేవారు కారు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ మొత్తాన్ని దాచుకునేవారు. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగానూ మంచి లక్షణంగా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కల్చర్ వచ్చింది. పుట్టిన రోజు, వివాహ మహోత్సవం.. ఇలా సందర్భమేదైనా పారీ్టలివ్వడం పరిపాటిగా మారింది. ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు.
ఖరీదైన ఆహారాన్ని తింటున్నామనే భ్రమలో ఉంటున్నారే గానీ, ఇవి ఆరోగ్యకరమాననే అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిల్వ ఉంచిన.. ప్రమాదకర రసాయనాలు కలిపిన ఫుడ్‌ను తింటున్నారు. వీటితో అప్పటికప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా, దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కేన్సర్ రోగుల్లో 53 శాతం మంది కల్తీ ఆహారంతోనే సమస్య తెచ్చుకున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
నిబంధనలు బేఖాతర్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్నా, పెద్ద రెస్టారెంట్లు, ధాబాలు, చాట్, నూడిల్స్ షాపులు దాదాపు ఐదు వేలకుపైగా ఉంటాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే వీటి సంఖ్య దాదాపు మూడు వేలు ఉంటుందని అంచనా. వీటి ద్వారా ఏటా రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌లను పొంది, నిబంధనల మేరకు ఫుడ్‌ను తయారు చేయాల్సి ఉంది. ఈ రూల్ 2006 నుంచి అమల్లో ఉంది.
ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లున్నారు. వీరు నెలకు 12 శాంపిళ్లను సేకరించాల్సి ఉంది. ఆపై వీటిని ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలి. అయితే ఇంత పెద్ద జిల్లాలో కేవలం 12 శాంపిళ్లనే సేకరిస్తే, మిగిలిన వాటి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు.
అనుమతుల్లేకుండానే..
జిల్లాలో అనుమతి తీసుకొని వ్యాపారం చేసే సంస్థలు 25 శాతం కూడా ఉండవని తెలుస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల మినహా మిగిలిన చోట్ల పరిశుభ్రతను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నాసిరక ఆహార పదార్థాల వినియోగం.. రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం.. ఆపై వీటిని వేడి చేసి అంటగడుతున్నారు. పట్టణాల్లో మురుగు కాలువలు, చెత్త కుప్పల పక్కన ఫాస్ట్‌ఫుడ్స్ సెంటర్లు దర్శనమి స్తున్నా, ప్రశ్నించే వారే కరువవుతున్నారు.
జరుగుతోందిలా..
» మున్సిపల్ కుళాయిలు, బోరు నీటిని పాలల్లో కలుపుతున్నారు. చిక్కదనం కోసం నాసిరక పౌడర్లు, యూరియా, పిండి, నూనెను కలిపి విక్రయిస్తున్నారు.
» టీ పొడిలో ఇనుప పొడి, రంపపు పొట్టును మిశ్రమంగా చేస్తున్నారు. దీని వల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ప్రమాదం ఉంది.
» పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీల్లో అధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆపై సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. వీటితో జీర్ణకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉంది.
» చికెన్, మటన్ బిర్యానీలు, తందూరి చికెన్‌లో ఆకట్టుకునేందుకు గాను హానికరమైన రంగులను వాడుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో పాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
» నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం చేపల విక్రయదారులు అమ్ముతున్నా, అడిగే నాథుడే లేరు. వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో చెరువుల్లో పెంచి పోషిస్తున్నారు.
» మిరపకాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులను వినియోగిస్తున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే కేన్సర్ సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది.
» నూనెను మళ్లీ.. మళ్లీ కాస్తున్నారు. వీటి ద్వారా కేన్సర్, అల్సర్లొచ్చే ప్రమాదమున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు.
» చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లలో వేడి కూరలు, పప్పు, సాంబారు తదితర ఆహార పదార్థాలను పల్చటి పాలిథిన్ కవర్లలో వేసిస్తున్నారు. వేడికి కరిగి వీటిని తినే వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
» అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం అక్రమార్కులు కల్తీ చేస్తున్నారు.
నిత్యం తనిఖీలు చేస్తున్నాం
హోటళ్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లు తదితరాల్లో తనిఖీలను నిత్యం చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా.. చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయి. ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా ఉండేందుకు రంగులు కలుపుతున్నారనే అంశాన్ని గుర్తించాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 307 శాంపిళ్లను సేకరించి.. ఆరు కేసులపై కోర్టుకు నివేదించాం. జేసీ వద్ద 22 కేసులపై విచారణ జరిపి రూ.మూడు లక్షలు జరిమానాను విధించాం. కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ ఆహార నియంత్రణాధికారి


