
కీలక ప్రాజెక్టులప్రారంభం, శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా సౌకర్యాలకు కొత్త ఊపిరి పోసే రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని రోహిణిలో రూ.11 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు.
అనుసంధానత మెరుగు ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్–2 (యూఈఆర్–2) ప్రాజెక్టులను చేపట్టారు. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలు, మలీ్ట–మోడల్ కనెక్టివిటీ కలి్పంచడమే వీటి ప్రధాన ఉద్దేశం. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేపై దాదాపు రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల ఢిల్లీ భాగం అభివృద్ధి చేశారు.
ప్యాకేజీ–1 కింద శివమూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్–21 ఆర్‌యూబీ వరకు (5.9 కి.మీ), ప్యాకేజీ–2 కింద ద్వారకా సెక్టార్–21 ఆర్‌యూబీ నుంచి ఢిల్లీ–హరియాణా సరిహద్దు వరకు (4.2 కి.మీ) నిర్మాణం చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్‌సీ బ్లూ, ఆరెంజ్ లైన్లు, కొత్తగా వచ్చే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా బస్ డిపోలతో నేరుగా అనుసంధానమవుతుంది. గత సంవత్సరం మార్చిలో హరియాణా విభాగంలోని 19 కి.మీ భాగాన్ని మోదీ ప్రారంభించారు.
యూఈఆర్–2 ప్రాజెక్టు
రూ.5,580 కోట్లతో యూఈఆర్–2లోని అలీపూర్–డిచాన్ కలాన్ రహదారితో పాటు, బహదూర్‌గఢ్, సోనిపట్‌లకు కొత్త లింక్ రోడ్లు కూడా ప్రజల వినియోగానికి అందించనున్నారు. ఇవి ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్‌హెచ్–09 వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. అంతేగాక పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు ఎన్‌సీఆర్‌లో రవాణా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా రోహిణిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.