‘కూటమి పాలనలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు’ | Vijayawada Mayor Bhagyalakshmi Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘కూటమి పాలనలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు’

Aug 17 2025 7:15 PM | Updated on Aug 17 2025 7:34 PM

Vijayawada Mayor Bhagyalakshmi Takes On AP Govt
  • రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు
  • కూతురి హాస్టల్ సీటు అడిగితే అధికార పార్టీ నేతల లైంగిక వేధింపులు
  • ఇంతకన్నా నీచమైన ప్రభుత్వం ఉంటుందా..?
  • ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తున్న నీచ సంస్కృతి
  • నిన్న కోనేటి ఆదిమూలం, నేడు కూన రవి కుమార్
  • అయినా చర్యలకు వెనుకాడుతున్న చంద్రబాబు
  • అధికార పార్టీ అరాచకాలపై తీవ్రంగా మండిపడ్డ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి

తాడేపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అడుగడుగునా అకృత్యాలు పెచ్చుమీరాయనివైఎస్సార్‌సీపీ నేత, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార మదం, అహంకారంతో కూటమి పార్టీల నేతలే ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం అత్యంత దారుణమని మండిపడ్డారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తేల్చి చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

మహిళా ఉపాధ్యాయులకే రక్షణ కరువు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను మానసికంగా వేధించడం అత్యంత దుర్మార్గం. బాధిత ప్రిన్సిపాల్ ఎంత వేదనకు గురి అయితే బయటకు వచ్చి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అర్ధరాత్రి వీడియో కాల్స్ తో సహా ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కన్నీరు పెట్టుకుంటూ బాధిత ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు.

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దాష్టీకం, వేధింపులు పై అధికార టీడీపీకు చెందిన బాధిత మహిళే నేరుగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రకాలుగా సాక్షాత్తూ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?.ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార్లతో సమక్షలు చేస్తున్న చంద్రబాబు...  మహిళలపై ఈ స్ధాయిలో వేధింపులు, దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు భయం లేదు? కీచకుల్లా వ్యవహరిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు సర్వసాధారణం అయిపోయాయి. స్కూల్లు, కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులు గురువుతున్నారు. అధికార మదం, అహంకారంలో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ తో ఎమ్మెల్యే అర్ధరాత్రి వీడియో కాల్  మాట్లాడాల్సిన అవసరం ఏముంది? స్కూల్లో సీటు కావాలంటే.. ఎమ్మెల్యేగా రిఫరెన్స్ చేయవచ్చు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ సమయంతో సంబంధం లేకుండా మహిళా టీచర్ ని అర్ధరాత్రి వరకు మీ ఆఫీసులో కూర్చోబెట్టాల్సిన పని ఏమిటి? అర్ధరాత్రి వీడియో కాల్ చేయడమేంటి? ఇది ఏ రకమైన సంస్కృతి? ఎమ్మెల్యే స్ధానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో కాల్ వివరాలు బాధితురాలు మీడియాకు చూపిస్తుందంటే ఏ స్ధాయిలో హింసకు గురి చేస్తున్నారో అర్దం అవుతుంది. తోటి ఉపాధ్యాయులు ముందు బాధితురాలు రోదిస్తున్నా... ఆమెను తిట్టడం ఏ రకమైన దాష్టీకం.

దిశ యాప్ రద్దుతో రక్షణ లేని ఆడబిడ్డలు:
మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిశ యాప్ ను ప్రవేశపెట్టాం. ఆపదలో ఉన్న బాధితురాలు దిశ యాప్ కు పోన్ చేసినా, ఫోన్ ను అటూ ఇటూ ఊపినా వెంటనే పోలీసులు వచ్చి ఆదుకునేవారు. తగిన సహాయం చేసేవారు. అలాంటి దిశ యాప్ ను ఈ ప్రభుత్వం మరుగున పెట్టింది. ఇవాళ ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేడు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. దిశ యాప్ ను తుంగలో తొక్కి పనిచేయని యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ పరిపాలన చూసి మహిళలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.

ఇవీ అధికార పార్టీ నేతల అరాచకాలు
కూటమి ప్రభుత్వం రాగానే అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం చేసిన దాష్టీకాన్ని అందరం చూశాం. అధికార పార్టీకే చెందిన ఓ బాధిత మహిళ ఆయన వేధింపులకు తాళలేక ఈ రాష్ట్రంలో రక్షణ లేదని ఏకంగా హైదారాబాద్ వెళ్లి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ రాష్ట్రంలో తన కష్టం చెప్పుకుంటే ప్రాణహాని కలుగుతుందన్న భయంతో పక్కరాష్ట్రానికి వెళ్లి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. 

చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న దగ్గర నుంచి మహిళలమీద ఈ దాష్టికాలు మొదలయ్యాయి. ఆ రోజు లక్ష్మి పార్వతిని నెపంగా చూపి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. అదే సంస్కృతిని ఆ పార్టీ నాయకులు ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే వాటిని చంద్రబాబు ఆపడం లేదు సరికదా కనీసం ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు.

రాష్ట్రంలో అడుగడుగునా మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నారు. వారిపై ప్రతిచోట టీడీపీ నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులు నుంచి  తిరుపతి అరుంధతి కాలనీలో టీడీపీ నాయకుడు ఉదయ్... స్థానిక మహిళమీద లైంగిక వేధింపులుకుపాల్పడ్డారు. అదే విధంగా మరో టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం కుమారుడు అభినవ్ ప్రేమ పేరుతో బాలికను తీసుకెళ్లి మోసగించి... నాలుగు తర్వాత విడిచిపెట్టాడు.  

బాధిత బాలిక తల్లి వేదనతో ఆత్మహత్యాయత్నం చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు.రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కూడా స్థానికంగా ఓ బాలికను మోసగించి గర్భవతిని చేశాడు. సదరు బాధిత బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చినా సంబంధం లేదంటూ బుకాయిస్తే.. స్ఠానిక టీడీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చాలని చూడ్డం అత్యంత దారుణం.

అనంతరపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామానికి సమీపంలోని రామగిరిలో ఓ దళిత బాలికపై అధికార పార్టీకి చెందిన 14 మంది పదే,పదే అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో షేక్ మీరా అనే వ్యక్తి అర్ధరాత్రి ఏడేళ్ల బాలికపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు.  బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేస్తే విషయం బయటకు వచ్చింది. పల్నాడు జిల్లాలో బొడ్డు వెంకేటశ్వరరావు అనే టీడీపీ నాయకుడు .. ఓ అంగన్‌వాడీ టీచరును కులం పేరుతో దూషించి ఆమెను వేధింపులు గురిచేశాడు. 

హోంమంత్రి అనిత నియోజకవర్గంలో లక్ష్మీ, వరలక్ష్మీ అనే ఇద్దరు మహిళల దుస్తులు చింపి, వారి జుత్తుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్  కిరణ్ రాయల్ మీడియాలో నీతులు చెబుతాడు. కిరణ్ రాయల్ అరాచకాలపై లక్ష్మీరెడ్డి అనే బాధిత మహిళ అన్ని ఆధారాలతో మీడియాకు వివరాలిచ్చింది. కిరణ్ రాయల్ తనను ఏ రకంగా ఆర్ధికంగా దోచుకున్నాడో ఆధారాలతో చెప్పింది. కానీ అతడిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి నాయకులుగా మీరు ఇన్ ఛార్జ్  బాధ్యత ఇస్తారు?

బిల్లులు పాస్ అవ్వాలన్నా, పనులు జరగాలన్నా, అవసరాలు తీరాలంటే మహిళల మీద ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసల టీడీపీ కార్యకర్త.. కోటిపల్లి రాజు..9వ తరగతి బాలికమీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భవతి కావడంతో విషయం బయటకు వచ్చింది. ఇదే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో ఇద్దరు విద్యార్థినులు మీద టీడీపీ చెందిన యువకులు గ్యాంగ్ రేప్ చేస్తే.. ఎలాంటి చర్యలు లేవు. కేవలం సెటిల్మెంట్లు, పంచాయితీలు చేయడం లేదంటే నిందితులను వేరే ఊరుకు తరలించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇది ఇవాళ వచ్చిన సంస్కృతి కాదు. 2014లో కూడా మనం చూశాం...ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి జరిగితే.. చంద్రబాబునాయుడు ఇలాగే సెటిల్మెంట్ చేశారు.

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం- ఆడబిడ్డల కష్టాలు
మహిళలకు రేషన్ కార్డు నుంచి ఏం కావాలన్నా, ఏం దరఖాస్తు చేసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల దగ్గరకి వెళ్లాల్సిన ఖర్మ పట్టించారు. గతంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం కావాలన్నా గుమ్మం దగ్గరకే అందేవి. అర్హత ఉంటే ఈ సంక్షేమపథకం వస్తుందని నేరుగా ఇంటికే వెళ్లి చెప్పేవారు. వారికి కావాల్సిన పత్రాలు తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసేవారు. ఎలాంటి సమస్య ఉన్నా తీరేది. ఏ నాయకులను ఆశ్రయించకుండా, ఎవరికీ కప్పం కట్టకుండా అన్ని పనులు అయ్యేవి. 

ఈ ప్రభుత్వంలో భర్త చనిపోయిన ఒంటరి మహిళా ఆరోతరగతి చదువుతున్న కూతురికి సీటు కావాలని అడిగితే కూడా అత్యంత నీచంగా లైంగికంగా వేధిస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి హయాంలోని సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇప్పుడు నాయకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలోవైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో  డీబీటీ  ద్వారా మహిళల అకౌంట్ లో జమ చేస్తే వారికి ఆర్ధిక స్వావలంబన ఉండేది. నేడు అవన్నీ పూర్తిగా అటకెక్కాయి. నేడు మహిళలకు అవేవీ అందకపోగా.. మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.

మహిళల తరపున వైఎస్సార్‌సీపీ ఆందోళన:
ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళా హోమంత్రిగా అనిత కానీ, ప్రశ్నిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు ?. ప్రశ్నిస్తానన్న నాయుకుడికి బాధిత మహిళలు వాట్సప్ లో తమ ఆవేదనను పంపిస్తున్నారు. కానీ ఉపముఖ్యమంత్రికి సినిమాలకే టైం సరిపోవడం లేదు. ఇలాంటి వీడియోలు చూడ్డానికి ఏం టైం సరిపోతుంది. హోంమంత్రి అనిత తన బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. నిరంతరం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే ఆమెకు టైం అంతా వెచ్చిస్తోంది.  హోం శాఖ బాధ్యతలు తప్ప అన్ని పనులు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకం భ్రమరావతిలో బిజీగా ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చంద్రబాబు కళ్లు మూసుకుని పాలన సాగిస్తున్నారు. ఈ రకమైన అరాచకపాలనపైవైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాన్ని తెలియజేస్తూ ఆందోళన చేస్తామని మేయర్ భాగ్యలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement