క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి | Jammu Kashmir Kathua Cloudburst Several Houses Rubble And Floodwater, Watch Shocking Videos Inside | Sakshi
Sakshi News home page

క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి

Aug 17 2025 10:08 AM | Updated on Aug 17 2025 12:20 PM

Jammu kashmir Kathua cloudburst Several houses rubble and floodwater

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఘటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో, ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్‌ నీట మునిగింది. దీంతో, కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.

 

మరోవైపు.. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్-హుట్లీలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో, స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్‌వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్‌వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement