
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.
కొత్త పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్, మెరుగైన నెట్‌వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్‌వేర్ అమలు చేయబోతున్నారు.
ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్‌వన్ (RailOne) అనే కొత్త సూపర్ యాప్‌ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్‌ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్‌బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్‌వన్ యాప్‌లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్ రౌండప్ ట్రిప్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది.