
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం. తాజాగా మ్యాక్సీ తన జాతీయ జట్టుకు ఆడుతూ (సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్‌లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు.
173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్‌లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఆడడు కానీ, మిగతా చోట్లంతా సత్తా చాటుతాడంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రికెట్ అభిమానుల్లో బాధకు అర్దముంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇతగాడికి ఐపీఎల్ అవకాశాలిస్తే.. దారుణంగా నిరుత్సాహపరిచాడు. గత రెండు మూడు సీజన్లుగా పరిస్థితి ఇదే.
గత సీజన్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. 5 మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులే చేసి మధ్యలో స్వదేశానికి చెక్కేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకొని, మంచి మొత్తానికి కొనుగోలు చేసింది. వారి ఆశలపై మ్యాక్స్‌వెల్ నీళ్లు చల్లాడు.
ఈ వైఫల్యాలు చూసి మ్యాక్స్‌వెల్ ఫామ్ కోల్పోయుంటాడనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్‌లో అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 12 మ్యాచ్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. తన జాతీయ జట్టుకు ఆడేప్పుడు మ్యాక్స్‌వెల్ మరింత అంకితభావంతో ఆడి చెలరేగుతాడు. ఈ ఏడాది టీ20ల్లో ప్రదర్శనలే ఇందుకు ఉదాహరణ. ఈ యేడు అతను ఆసీస్ తరఫున 8 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి 174.2 స్ట్రయిక్‌రేట్‌తో 169 పరుగులు చేశాడు.
మ్యాక్స్‌వెల్ తన సొంత దేశం తరఫున ఎలా ఆడినా.. భారత అభిమానులకు పోయేదేమీ లేదు. అయితే దేశం తరఫున ఆడేప్పుడు చూపే అంకితభావాన్ని ఐపీఎల్‌ల్లోనూ కనబర్చాలని వారు ఆశిస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను భారీ అంచనాలు పెట్టుకునే కొనుగోలు చేస్తుంది. అలాంటప్పుడు ఆటగాళ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.
అయితే మ్యాక్సీ మాత్రం అలా చేస్తున్నట్లు కనిపిండం లేదు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు భారత్‌కు వస్తున్నాడా అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడే కాబట్టి, అత్తగారింటికి చుట్టపు చూపుకు వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో మ్యాక్సీలో కనిపించిన కమిట్‌మెంట్ ఇటీవలకాలంలో కనిపించడం లేదు. పంజాబ్‌కు ముందు ఆర్సీబీ తరఫున తరఫున కూడా వైఫల్యాల పరంపర కొనసాగించాడు. ఇది చూస్తే, చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల లాగే మ్యాక్స్‌వెల్‌కు కూడా ఐపీఎల్ అంటే గిట్టదేమో అని అనిపిస్తుంది.