
ఆర్థిక వ్యవస్థకు మరింత దన్ను
2047 నాటికి ఒకే శ్లాబ్ దిశగా అడుగులు
రెండు శ్లాబులతో తగ్గనున్న పలు ఉత్పత్తుల ధరలు
చౌక కానున్న టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు
దిగి రానున్న ఆహార ఉత్పత్తుల ధరలు
ప్రభుత్వాధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల్లో ప్రతిపాదిత మార్పులను ‘కొత్త తరం’గేమ్ చేంజర్ సంస్కరణలుగా సీనియర్ ప్రభుత్వాధికారులు అభివర్ణించారు. ఇవి అంతిమంగా 2047 నాటికి ఒకే శ్లాబ్ దిశగా బాటలు వేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సాధారణంగా ఆదాయ, వ్యయాల సామర్థ్యాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండే సంపన్న దేశాలకు సింగిల్ రేటు విధానం అనువుగా ఉంటుంది. అలా మన దగ్గర కూడా ఒకే శ్లాబ్ విధానాన్ని తేవడమే అంతిమ లక్ష్యం. అయితే, ప్రస్తుతం అందుకు సమయం అనువుగా లేదు.
భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారిన తర్వాత దానిపై దృష్టి పెట్టొచ్చు’అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న నాలుగు శ్లాబులను 5 శాతం, 18 శాతం కింద రెండు శ్లాబులుగా, డీమెరిట్ గూడ్స్‌పై 40 శాతంగా సవరించాలని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రెండు శ్లాబుల విధానాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత దన్ను లభిస్తుందని, అమెరికా టారిఫ్ ముప్పులను కూడా కొంత వరకు అధిగమించవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు తొలుత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్యానెల్‌కి, ఆ తర్వాత జీఎస్‌టీ కౌన్సిల్ ముందుకు వెళ్తాయి. పన్ను సంస్కరణలపై జీఎస్‌టీ కౌన్సిల్ సెప్టెంబర్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ధరలు తగ్గుతాయి.. వినియోగం పెరుగుతుంది..
కొత్త విధానంతో చాలా నిత్యావసర వస్తువులు తక్కువ శ్లాబులోకి మారడం వల్ల వాటి ధరలు తగ్గుతాయని, వినియోగం పెరుగుతుందని ఒక అధికారి వివరించారు. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ), మధ్య తరగతి, పేదలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్‌జెన్ జీఎస్‌టీని సిఫారసు చేశాం. అలాగే రోజువారీ వినియో గించే ఉత్పత్తుల ధరలు కూడా తగ్గేలా ప్రతిపాదనలు చేశాం’ అని తెలిపారు. పన్నులు తగ్గడం వల్ల ప్రజల చేతిలో మరింత డబ్బు మి గులుతుందని, ఇది అంతిమంగా వినియోగం మరింత పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పన్ను రేట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కేంద్రం స్వల్పకాలికం కన్నా దీర్ఘకాలిక పరిష్కార మార్గం వైపే మొగ్గు చూపిందని చెప్పారు. ‘మేం ఒక్కొక్క ఉత్పత్తిని నిశితంగా పరిశీలించాం. రైతులు ఉపయోగించే పురు గు మందులు కావచ్చు, విద్యార్థుల పెన్సిళ్లు లేదా ఎంఎస్‌ఎంఈలకు అవసరమయ్యే ముడి వస్తువులు కావచ్చు.. ప్రతిదానిపై కూలంకషంగా చర్చించాం. మెరిట్, స్టాండర్డ్ శ్లాబుల కింద వర్గీకరించాం’ అని ఆ అధికారి చెప్పారు.
తాజా ప్రతిపాద నల ప్రకారం 12% కేటగిరీలో ఉన్న వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ మొదలైన 99% ఉత్పత్తులు 5% శ్లాబ్‌లోకి మారనున్నాయి. 28% శ్లాబ్‌లోని ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే సిమెంట్ లాంటి ఉత్పత్తులు 18% శ్లాబ్‌లోకి వస్తాయి. ప్రస్తుతం 12% శ్లాబ్ పరిధిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్, దుస్తులు మొదలైన 20% ఉత్పత్తులను 5% శ్లాబ్‌లోకి మార్చడం వల్ల ఆదాయం తగ్గినా, వినియోగం పెరగడం వల్ల ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.