
గుకేశ్‌కు ఆరో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. బ్లిట్జ్ విభాగంలో 18 పాయింట్లతో వియత్నాంకు చెందిన లియామ్ లె క్వాంగ్‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికా ప్లేయర్ లెవాన్ అరోనియన్ 24.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన అరోనియన్... మరో రెండు రౌండ్‌లు మిగిలుండగానే టైటిల్ గెలుచుకున్నాడు.
ఫాబియానో కరువానా (అమెరికా; 21.5 పాయింట్లు), మ్యాక్సిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్; 21 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇటీవల లాస్ వెగాస్ ్రïఫీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 42 ఏళ్ల అరోనియన్... అదే జోరులో ఇక్కడ కూడా విజేతగా నిలిచాడు. అరోనియన్‌కు 40 వేల డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
రెండు రోజుల విశ్రాంతి అనంతరం గుకేశ్ సింక్యూఫీల్డ్ కప్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంట్లో భారత్ నుంచి యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా పాల్గొననున్నాడు. సింక్యూఫీల్డ్ టోర్నీ క్లాసికల్ పోరు కావడంతో ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన గుకేశ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగే అవకాశం ఉంది.