
కన్నడ హీరో అజయ్ రావు (Ajay Rao) వైవాహిక బంధానికి బీటలు వారిందంటూ కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. 11 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య స్వప్న విడాకుల కోసం దరఖాస్తు చేసిందని టాక్ నడుస్తోంది. కొద్ది నెలలుగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా గృహ హింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రూమర్లు వినిపిస్తున్నాయి.

తెలీదంటూనే..
తాజాగా ఈ వ్యవహారంపై అజయ్ పెదవి విప్పాడు. నా భార్య కోర్టుకు వెళ్లిందా? ఏమో, నాకైతే తెలియదు. ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడతాను అన్నాడు. అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి సున్నిత వ్యవహారంపై గోప్యత పాటించాలని కోరుతున్నాను. మా వ్యక్తిగత విషయాల గురించి ఎవరూ ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విన్నపిస్తున్నాను. సమస్యలనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. దయచేసి మా ఫ్యామిలీ విషయాలను పబ్లిసిటీ చేయొద్దు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చాడు.

ఈ మధ్యే గొడవలు?
కాగా అజయ్-స్వప్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014 డిసెంబర్ 18న వీరి వివాహం జరిగింది. 2019లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు చెరిష్మా జన్మించింది. 2024లో అజయ్ బెంగళూరులో ఓ ఇల్లు కొనుక్కుని భార్యాకూతురితో సహా అందులోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ గృహప్రవేశ వేడుకకు కన్నడ సినీప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇటీవలే అజయ్ నిర్మాతగా మారాడు. యుద్ధకాండ 2 అనే సినిమాను నిర్మించడంతో పాటు అందులో హీరోగా నటించాడు.
సినిమాతో భారీ నష్టాలు
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ గొడవలు పెద్దవి కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాలి! ఇకపోతే అజయ్ రావు.. ఎక్స్‌క్యూజ్‌మీ (2003) సినిమాతో హీరోగా మారాడు. తాజ్ మహల్, ప్రేమ్ కహానీ, కృష్ణ లవ్ స్టోరీ, కృష్ణ-లీల వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రొమాంటిక్ హీరో ఇమేజ్ కారణంగా అతడికి సాండల్‌వుడ్ కృష్ణ అనే బిరుదు దక్కింది. ఇతడు చివరగా యుద్ధకాండ చాప్టర్ 2 చిత్రంలో కనిపించాడు.