
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
బ్లాక్‌బెల్ట్
నిమిషా తండ్రి సజయన్, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.
మేకప్ నచ్చదు
నటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్‌కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అప్పటికప్పుడు వంట నేర్చుకుని..
కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్‌లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది.
GST చెల్లించలేదని ఆరోపణలు
ఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్‌టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.
రంగు అడ్డు కాదు
కొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది.
చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్