
ఆవుపేడకు ఉన్న ప్రశస్తి తెలిసినదే! ఆవుపేడతో తయారు చేసిన పిడకలను ఇదివరకటి కాలంలో పొయ్యి రాజేసుకోవడానికి వంటచెరకుగా వినియోగించేవారు. ఇప్పటికీ ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్, అగరొత్తులు, జపమాలలు, కుండీలు, దేవుళ్ల ప్రతిమలు, ప్రమిదలు, బొమ్మలు, విభూది, పళ్లపొడి వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైతు సుబ్బరాజు ఆవుపేడకు వనమూలికలను జతచేసి, అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
చిత్తూరు జిల్లా నగరి మండలం, రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు విలక్షణమైన పద్ధతిలో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగుచేసిన రైతుగా, పాడి రైతుగా తనకు గల అనుభవంతో పర్యావరణ రక్షణ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా, ఆయుర్వేద నిపుణులను కలుసుకొని, వారి సూచనలతో అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. ఇంటి వద్దనే ఒక పాక వేసుకుని, ఈ అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు.
ఆయుర్వేద మూలికలతో...
దేశవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతి, తామర మొదలైన సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాంసి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, సుగంధిపాల, గ్రంథి, చెంగల్వకోష్టు, పచ్చకర్పూరం వంటి మూలికలు, ఆయుర్వేద ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి, కావలసిన ఆకారంలో పిడకలను తయారు చేసి ఎండబెడతారు. వీటి తయారీకి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులూ అందుబాటులో ఉంటే ఒక మనిషి రోజుకు మూడువందల వరకు పిడకలను తయారుచేసి, ఎండబెట్టవచ్చు.
ఈ పిడకలను హోమద్రవ్యంగా అగ్నిహోత్రంలో వినియోగించవచ్చు. అలాగే, వీటి పొగను ఇంట్లో ధూపంగా కూడా వేయవచ్చు. ఈ పిడకల నుంచి వెలువడే పొగ సుగంధభరితంగా ఉండి, ఇంట్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు ఈ అగ్నిహోత్ర పిడకలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఈ పిడకలను వాడి, వాటి నాణ్యతను తెలుసుకున్నవారు మళ్లీ మళ్లీ వాటిని వినియోగిస్తున్నారు.
ఆరోగ్యం కోసం చేస్తున్నా...
ఆరోగ్యకరమైన పంటలను అందించడానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే గాలిని కూడా వీలైనంత మేరకు ఆరోగ్యకరంగా మార్చాలనే ఆలోచనతోనే ఈ పిడకల తయారీని ప్రారంభించాను. పూర్వీకులు ఉదయాన సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవు పేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఇటీవలి ప్రయోగాల్లో కనుగొన్నారు.
ఒక పిడక మీద సెల్‌ఫోన్ ఉంచినపుడు దాని నుంచి వెలువడే రేడియేషపరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాల్లో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకుని, కొందరు ఆయుర్వేద నిపుణుల సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నాను. వీటి తయారీకి కావలసిన వస్తువులను సేకరించడం చాలా కష్టతరంగా మారింది.
పది కిలోల పేడతో పిడకలు తయారు చేయాలంటే, మూడు కిలోల నెయ్యి అవసరం. వీటి తయారీకి వాడే పాలు, పెరుగు, పంచితంతో పాటు వీటిలో వేసే మూలికలు ఇక్కడ లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపులకు వెళ్లి తీసుకువచ్చా. ఇలా తయారుచేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోంది. నేను రూ. 30కే విక్రయిస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా.
– సుబ్బరాజు, పాడిరైతు, రాజులకండ్రిగ, నగరి మండలం.
కోనేరి చంద్రమోహన్, నగరి
(చదవండి: మట్టి నుంచి విద్యుత్తు!)