
మిల్క్ కేక్ బిట్స్
కావలసినవి: చిక్కటి పాలు– రెండు లీటర్లు, పంచదార లేదా బెల్లం కోరు– అర కప్పు, నిమ్మరసం– ఒక టీ స్పూన్, బాదం పేస్ట్– పావు కప్పు (బాదం నానబెట్టి, తొక్క తీసి మిక్సీ పట్టుకోవాలి), దాల్చినచెక్క పొడి– కొద్దిగా
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక పాత్రలో పాలు పోసి, చిన్న మంట మీద బాగా మరిగించి సగం అయ్యేలా చేసుకోవాలి. కాసేపటి తర్వాత నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి, మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. ఒకేసారి పోస్తే పాలు విరిగిపోతాయి అందుకే స్లోగా వెయ్యాలి. అనంతరం బాదం పేస్ట్, దాల్చిన చెక్క పొడి వేసి పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.
పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార లేదా బెల్లం కోరు కలపాలి. తర్వాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు అంగుళాలు లోతున్న బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ కోవా మిశ్రమాన్ని వేసుకుని, చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
జపనీస్ యాకిమోచి
కావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు (కొత్తబియ్యం తీసుకోవాలి), పంచదార పొడి– పావు కప్పు+2 టేబుల్ స్పూన్లు, నీళ్లు– ఒక కప్పు, బటర్– ఒక టీ స్పూన్, కార్న్ పౌడర్– కొద్దిగా (నీళ్లు లేదా పాలు పోసుకుని క్రీమ్‌లా చేసుకోవాలి), సోయాసాస్– కొద్దిగా
తయారీ: ముందుగా బియ్యం నానబెట్టి, కాసేపటికి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం, నీళ్లు పోసుకుని, దానిలో బటర్ వేసుకుని, చిన్నమంటపై ఉడికించుకోవాలి. కాస్త పలుకు ఉన్న సమయంలో తీసి మిక్సీలో వేసుకోవాలి. పావు కప్పు పంచదార పొడి, కార్న్ మిశ్రమం వేసుకుని బాగా మెత్తగా సాగేట్టుగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ ట్రేలో వేసుకుని, ఓవెన్‌లో ఉడికించుకుని, నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద సోయాసాస్, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, కొద్దిగా నీళ్లు వేసుకుని పాకంలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ ముక్కలకు కొద్దిగా మైదాపిండి అద్ది, గ్రిల్ లేదా ఓవెన్ మీద బేక్ చేసుకోవాలి. అనంతరం వాటిని సోయాసాస్ మిశ్రమంలో ముంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి
ఆనియన్ భక్రీ
కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు, పెద్ద ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి– ఒకటి (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు– ఒక టీస్పూన్ (వేయించినవి), పసుపు– అర టీస్పూన్, కారం– తగినంత ఉప్పు, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నువ్వులు, పసుపు, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పడు దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
5 నుంచి 7 నిమిషాల వరకూ ఆ ముద్దను బాగా పిసకాలి. అనంతరం 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని, నిమ్మకాయంత ఉండలు చుట్టుకుని, చపాతీలా కాకుండా, కొద్దిగా మందంగా ఉండేలా, గుండ్రంగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని, కొద్దికొద్దిగా నూనె వేసుకుని, వాటిని దోరగా వేయించుకుంటే సరిపోతుంది.