ఈ సండే వెరైటీగా లెమెన్‌ షార్ట్‌బ్రెడ్‌, రైస్‌ కోకోనట్‌ ఇడ్లీ ట్రై చేయండిలా..! | Delicious Indian Sweets Recipes, Lemon Shortbread, Rice Coconut Idli And Rajasthani Ghevar, Step By Step Process Inside | Sakshi
Sakshi News home page

ఈ సండే వెరైటీగా లెమెన్‌ షార్ట్‌బ్రెడ్‌, రైస్‌ కోకోనట్‌ ఇడ్లీ ట్రై చేయండిలా..!

Nov 2 2025 2:08 PM | Updated on Nov 2 2025 4:05 PM

Funday Special: Sunday Special Snack Recipes

లెమెన్‌ షార్ట్‌బ్రెడ్‌
కావలసినవి:  మైదాపిండి, పంచదార పొడి– 2 కప్పులు చొప్పున, బటర్‌– ఒక కప్పు (తురుములా చేసుకోవాలి)
నిమ్మ తొక్క తురుము– ఒక టీ స్పూన్‌  పైనే
ఉప్పు– కొద్దిగా, చిక్కటి పాలు– పావు కప్పు
నిమ్మరసం– 6 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ముందుగా మైదాపిండి, ఉప్పును ఒక గిన్నెలో వేసి, బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద మిక్సీ గిన్నెలో బటర్‌ తురుము, అర కప్పు పంచదార పొడి, ఒక టీ స్పూన్‌ నిమ్మ తొక్క తురుము వేసి, మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అనంతరం మైదా మిశ్రమాన్ని దీనికి జోడించి, కొద్దిగా నీళ్లు కలుపుతూ, పిండిని ముద్దగా అయ్యే వరకు కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. 

పిండి మెత్తగా ముద్ద అయ్యే వరకు చేతులతో తేలికగా కలపితే సరిపోతుంది. ఆ ముద్దను ప్లాస్టిక్‌ ర్యాప్‌లో చుట్టి కనీసం ఒక గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈలోపు ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార పొడి, నిమ్మరసం, పాలతో పాటు అభిరుచిని బట్టి ఏలకుల పొడి వేసుకుని, బాగా కలుపుకోవాలి. గంట తర్వాత మైదా ముద్దను బ్రెడ్‌ ట్రేలో వేసి ఓవెన్‌లో బేక్‌ చేసుకుని, నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ముక్కపైన నిమ్మ తొక్క తురుము, పాలు– పంచదార మిశ్రమం వేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

రైస్‌ కోకోనట్‌ ఇడ్లీ
కావలసినవి:  అన్నం– ఒక కప్పు 
(మెత్తగా ఉడికినది)
బెల్లం కోరు– పావు కప్పు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు)
అరటిపండు– 1 (మీడియం సైజ్‌)
కొబ్బరి కోరు– అర కప్పు, ఏలకులు– 3 (పౌడర్‌ చేసుకోవాలి)
నెయ్యి– కొద్దిగా, డ్రై ఫ్రూట్స్‌– అలంకరణకు తగినంత

తయారీ: ముందుగా అన్నం, బెల్లం కోరు, అరటిపండు ముక్కలు మిక్సీ బౌల్‌లో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో కొబ్బరి కోరు, ఏలకుల పొడి వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–బెల్లం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని సుమారు పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ఆ ఇడ్లీలపై నచ్చిన 
డ్రై ఫ్రూట్స్‌ని అలంకరించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

రాజస్థానీ ఘేవర్‌
కావలసినవి:  మైదా పిండి– ఒక కప్పు, నెయ్యి– పావు కప్పు (గడ్డకట్టినది తీసుకోవాలి), చల్లని నీళ్లు– పావు కప్పు ఐస్‌ ముక్కలు– 8 ముక్కలు, చల్లని పాలు– 3 కప్పులు, శెనగ పిండి– ఒక టీస్పూన్, నిమ్మరసం– కొద్దిగా, నూనె– సరిపడా, పంచదార– ఒక కప్పు
నీళ్లు– అర కప్పు, ఏలకుల పొడి– పావు టీస్పూన్‌

తయారీ: ముందుగా ఒక గిన్నెలో పంచదార, అరకప్పు నీళ్లు కలిపి స్టవ్‌ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగేంత వరకు వేడి చేసి, ఆ తర్వాత 2 నిమిషాలు ఉడికించాలి. ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మూడు చుక్కల నిమ్మరసం కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.  ఈలోపు ఒక పెద్ద గిన్నెలో నెయ్యి, ఐస్‌ ముక్కలు వేసి, నెయ్యి తెల్లటి క్రీములా మారేవరకు బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండిని కొద్దికొద్దిగా జల్లించి, చల్లని పాలు కొంచెం కొంచెం పోస్తూ, పిండిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 

ఆ మిశ్రమం చాలా పల్చగా ఉండాలి. దానిలో ఒక టీ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. అనంతరం ఒక లోతైన, వెడల్పాటి కడాయిలో నూనెను సగ భాగం కంటే కొంచెం తక్కువగా పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని ఒక గరిటెతో నూనె మధ్యలోకి, పైనుండి నెమ్మదిగా సన్నని ధారలా పోయాలి. నూనె పైకి నురగలా వస్తుంది. నురగ తగ్గిన తర్వాత, మళ్లీ కొంచెం మైదా మిశ్రమాన్ని అదే విధంగా పోయాలి. 

ఇలా సుమారు ఏడెనిమిది సార్లు రిపీట్‌ చేస్తే, గుండ్రటి జల్లెడలా (ఘేవర్‌) మారి, దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇప్పుడు దాన్ని గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. మధ్యలో రంధ్రం దగ్గర చిన్న కర్ర లేదా స్పూన్‌ సహాయంతో నెమ్మదిగా బయటికి తీసి, టిష్యూ పేపర్స్‌ మీద కాసేపు ఉంచాలి. 

ఇదే మాదిరి చాలా ఘేవర్‌లు తయారుచేసుకోవచ్చు. వేడి తగ్గిన తర్వాత వాటిని ఒక పెద్ద బౌల్‌లోకి జాగ్రత్తగా ఉంచి, వాటిపైన పంచదార పాకం పోసి, సర్వ్‌ చేసుకునే ముందు పిస్తా బాదం వంటి ముక్కలతో నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది. 

(చదవండి: అలా ఉంటే..డయాబెటిస్‌ బోర్డర్‌లోకి వచ్చినట్లే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement