అలా ఉంటే..డయాబెటిస్‌ బోర్డర్‌లోకి వచ్చినట్లే..? | health tips: Early Signs and Symptoms of Diabetes | Sakshi
Sakshi News home page

అలా ఉంటే..డయాబెటిస్‌ బోర్డర్‌లోకి వచ్చినట్లే..?

Nov 2 2025 1:47 PM | Updated on Nov 2 2025 1:47 PM

health tips: Early Signs and Symptoms of Diabetes

డయాబెటిస్‌ నిర్ధారణ కోసం పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్‌) ఒకసారి రక్తపరీక్షా, అలాగే ఏదైనా తిన్నాక దాదాపు రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్‌ లంచ్‌ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్‌ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్‌’ కండిషన్‌లో ఉన్నారనీ... అంటే భవిష్యత్తులో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అని, డయాబెటిస్‌ చాలాకాలం వరకు రాకూడదంటే ఆ టైమ్‌లో ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవలంటూ డాక్టర్లు సూచిస్తారు. 

మరి... ఫాస్టింగ్‌ విలువలు ఎక్కువగానూ... పోస్ట్‌ లంచ్‌ మరీ తక్కువగానూ ఉంటే...? 
కొందరిలో ఫాస్టింగ్‌ విలువలు నూరుకు బదులుగా 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్‌ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. 

ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్‌  లంచ్‌లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. అంతేతప్ప... పోస్ట్‌ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. 

ఇలా జరగడానికి కారణాలేమిటంటే... 
రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్‌ గ్రంథి తగినంత ఇన్సులిన్‌ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉందన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. 

అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెర మోతాదులు బాగా పడిపోతాయి. ఇలా  జరిగినప్పుడు పోస్ట్‌ లంచ్‌ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. 

ఇదీ ఓ ముందస్తు హెచ్చరికే... 
డయాబెటిస్‌ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... కాబట్టి దీన్ని కూడా డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్‌’గా పరిగణించాలి. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు ఆహారంలో అన్నం (పిండిపదార్థాలు) తగ్గించి, అన్ని రకాల ΄ోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. 

వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు ఉపయోగించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్‌ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ మేలు చేసేవే. 

(చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement