కొంతమంది చిన్నపిల్లల్లో వారి పసివయసులో కనిపించే గుండె రంధ్రాలు తల్లిదండ్రులను చాలా ఆందోళనలో ముంచెత్తుతాయి. ఇలా పిల్లల గుండెల్లో రంధ్రాలు కనిపించడానికి కారణముంది. మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఒక పొడవాటి పైప్ వంటి నిర్మాణం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో ఆ పైప్ లాంటి నిర్మాణం నుంచే గుండె తాలూకు వివిధ భాగాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని రంధ్రాలు ఉండిపోతాయి.
గుండెలో రంధ్రాలకు కారణాలు...
దాదాపు పిల్లలందరిలోనూ గుండె అభివృద్ధి చెందే సమయంలో ముందుగా ఏర్పడ్డ రంధ్రాలు ఆ తర్వాతి కాలంలో పూర్తిగా పూడుకుంటాయి. అయితే కేవలం కొద్దిమంది చిన్నారుల్లో మాత్రం గుండె రూపొందే క్రమంలో ఏర్పడ్డ రంధ్రాలు వాటంతట అవే పూడుకుపోవు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలూ ఈ రంధ్రాలకు కారణమవుతాయి.
అప్పుడేమవుతుందంటే...
ఏట్రియల్ లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే ఇలాంటి రంధ్రాల కారణంగా... రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.
చాలావరకు వాటంతట అవే పూడుకునేలా...
గుండెలో రంధ్రాలు కనిపించిన వెంటనే వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. మరీ ప్రమాదకరమని భావించిన కేసుల్లో తప్ప... చాలా సందర్భాల్లో డాక్టర్లు కొన్ని రకాల మందులు వాడుతూ కొంతకాలం వేచిచూస్తారు. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 – 30 శాతం మంది వీఎస్‌డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు.
ఇలాంటి రంధ్రాలు పూడ్చటానికి మొదట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇలా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని సర్జరీ తాలూకు గాయం బాధించడంతో పాటు శస్త్రచికిత్స తాలూకు మచ్చలు కూడా శాశ్వతంగా మిగిలి΄ోయేవి.
కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారి΄ోయింది. ఇందుకోసం అప్పుడు సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్‌ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు.
అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియోకాంట్రాస్ట్‌ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు.
ఆ తర్వాత ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష చేసి రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చిన్నప్లిల్లలో కనిపించే ఇలాంటి గుండెరంధ్రాల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏఎస్‌డీ, వీఎసీడీ మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైన గుండెకు సంబంధించిన పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్నివాటికి (టీఏపీవీసీ, టీజీఏ వంటి వాటికి) చిన్నవయసులోనే ఆపరేషన్ అవసరం పడవచ్చు.
ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్


