నేను ఎనిమిది నెలల గర్భవతిని. స్కాన్‌లో నాకు వాసా ప్రీవియా ఉందని తేలింది. సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. అయితే, సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి?
– రమ్య, నెల్లూరు.
వాసా ప్రీవియా అనేది గర్భధారణలో అరుదుగా వచ్చే ఒక పరిస్థితి. ఈ సమయంలో బొడ్డు తాడు లేదా మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయం ముఖద్వారం పైన లేదా దాని దగ్గరగా ఉంటాయి. ప్రసవ సమయంలో ఇవి పగిలితే, తీవ్రమైన రక్తస్రావం జరగవచ్చు, ఇది చాలా ప్రమాదకరం. ఈ రక్తనాళాలు పగిలితే తీవ్ర రక్తస్రావం జరిగి, శిశువు ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు.
వాసా ప్రీవియాకు కచ్చితమైన కారణం తెలియదు. కాని, కొన్ని పరిస్థితులు ఈ సమస్య వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మాయ తాడు గర్భాశయం దిగువలో ఉండటం, బొడ్డు తాడు మధ్యలో కాకుండా పక్కకు మాయ తాకడం, చిన్న అనుబంధ మాయ ఉండటం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఉపయోగించడం వలన వాసా ప్రీవియా వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి, వాసా ప్రీవియాను సకాలంలో గుర్తించడం చాలా అవసరం. సాధారణంగా దీనిని త్రైమాసికంలో స్కాన్‌లోనే గుర్తించవచ్చు. ఈ సమయంలో ప్రత్యేక లక్షణాలు కనిపించవు. కాని, ఈ పరిస్థితిని గుర్తించకపోతే, ప్రసవానికి ముందు లేదా ప్రసవ సమయంలో రక్తనాళాలు పగిలి శిశువు వేగంగా రక్తాన్ని కోల్పోవచ్చు. తీవ్రమైన రక్తస్రావం వల్ల శిశువుకు ఆక్సిజన్ తగలకపోవడం, మెదడు దెబ్బతినడం లేదా గర్భంలోనే శిశువు మరణించడం కూడా సంభవించవచ్చు.
గర్భధారణ సమయంలో వాసా ప్రీవియా ఉన్నట్లు గుర్తించిన వెంటనే పనులు తగ్గించుకోవాలి. లైంగిక సంబంధానికి దూరంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరి, నిశితంగా పర్యవేక్షణలో ఉండటం అవసరం. వాసా ప్రీవియా ఉన్న చాలా సందర్భాల్లో, శిశువుకు రక్తస్రావ ప్రమాదం తగ్గే విధంగా 34 నుంచి 36 వారాల మధ్య నిర్ణీత సిజేరియన్ ప్రసవం చేస్తారు. అవసరమైతే శిశువు ఊపిరి తిత్తులు పూర్తిగా పెరగడానికి స్టెరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ప్రసవ సమయంలో కూడా వాసా ప్రీవియా ఉన్నట్లు అనుమానం ఉంటే, శిశువు భద్రత కోసం అత్యవసర సిజేరియన్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు రక్త మార్పిడి అవసరమవుతుంది. వాసా ప్రీవియాను పూర్తిగా నివారించలేరు కాని, నిరంతర చెకప్ ద్వారా దీన్ని ముందుగానే గుర్తించి, ప్రమాదాలను తగ్గించవచ్చు.
ఇలా చేయడం ద్వారా శిశువుకు హాని లేకుండా, సురక్షితంగా జన్మించే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి, సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ అనే తేడా లేకుండా, ముందే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధంగా ఉండటమే మంచిది.
ఆ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువ
శాశ్వత పరిష్కారం లేని వ్యాధుల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులనే ముందు వరుసలో చెప్పుకోవాలి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరబడి ఆరోగ్యవంతమైన కణాల మీద దాడి చేయడం వల్ల రకరకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు తలెత్తుతుంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్, టైప్–1 డయాబెటిస్, లూపస్, గ్రేవ్స్ డిసీజ్, మల్టిపుల్ స్లె్కరోసిస్, సొరియాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనైన వారు జీవితాంతం వాటికి మందులు వాడుతూ, చికిత్స కొనసాగించాల్సిందే! ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది.
ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 70 శాతం మహిళలేనని ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్ 40వ వార్షికోత్సవ నివేదిక ఇటీవల వెల్లడించింది. వీరిలో 20–50 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నట్లు ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన కూడా వెల్లడించింది.
జన్యు కారణాలు, పునరుత్పాదక వయసులో ఉన్న మహిళల్లో సంభవించే హార్మోన్ మార్పులు, గర్భధారణ, ప్రసవం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, స్థూలకాయం వంటివి మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు ఢిల్లీ ‘ఎయిమ్స్’లోని రుమాటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశమై కారణాలను కచ్చితంగా గుర్తించడానికి మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆమె అన్నారు.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..)


