‘‘డాక్టర్! మా పాప రోజంతా ఏడుస్తుంటుంది. కాని, మొబైల్ చూపించగానే సైలెంట్ అయిపోతుంది. అందుకే రోజూ రెండుమూడు గంటలు రైమ్స్, కార్టూన్లు పెడతాం’’ అని అమాయకంగా చెప్పింది అనిత.
ఆమె మాటల్లో ప్రేమ ఉంది కాని, లోపల ఒక ప్రమాదం దాగి ఉంది. అందుకే ఆ రెండేళ్ల పాపను చూశాను. ‘‘హాయ్ బుజ్జీ’’ అని పలకరించా, స్పందన లేదు. చేతికి బొమ్మ ఇచ్చినా ఆసక్తి చూపలేదు. కాని, ఫోన్ కనిపించగానే కళ్లు వెలిగాయి, చేతులు చాపింది. రెండేళ్లకే ఆ పాప మొబైల్‌కు అడిక్ట్ అయ్యిందని అర్థమైంది.
సైలెన్స్ వెనుక తుఫాను...
‘మేము బిజీగా ఉంటాం డాక్టర్. కాసేపు పిల్లల చేతిలో ఫోన్ పెడితే తప్పేముంది?’ అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. శిశువు ఏడుస్తుందంటే తనకు ఏదో అసౌకర్యంగా ఉందని సిగ్నల్. ‘‘అమ్మా, నా దగ్గరకు రా’’ అని పిలుపు.
ఆ సమయంలో బిడ్డ చేతికి ఫోన్ ఇవ్వడమంటే ఆ సిగ్నల్‌ను మ్యూట్ చేయడం. తల్లితో బంధాన్ని కోల్పోవడం. ఎందుకంటే, తల్లి ముఖం కంటే స్క్రీన్ వెలుతురు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులు దగ్గరున్నా బిడ్డ ఒంటరిగా పెరుగుతుంది.
మెదడు మీద కాంతి దాడి
శిశువు జననం తర్వాత మొదటి 36 నెలల్లో మెదడులో ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఆ కనెక్షన్లు ఆటలతో, స్పర్శలతో, సంభాషణలతో బలపడాలి. తల్లి నవ్వు, తండ్రి చూపు, అమ్మమ్మ పాట – ఇవే అసలైన మానసిక ఆహారం. కాని, ఫోన్ స్క్రీన్ ముందు కూర్చునే పిల్లల మెదడు వేరే రకంగా అభివృద్ధి చెందుతుంది. స్క్రీన్‌లోని వేగం, రంగులు, శబ్దం – ఇవన్నీ మెదడును ఎక్కువగా ప్రేరేపిస్తాయి. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
ఫలితంగా...
పిల్లలు సాధారణ ఆటలలో ఆసక్తి కోల్పోతారు. · బోరింగ్ అనిపిస్తే వెంటనే చిరాకు పెరుగుతుంది. · ఎప్పటికప్పుడు స్టిమ్యులేషన్ కావాలనిపిస్తుంది.
ఇదే మొదటి దశ డిజిటల్ అడిక్షన్.
స్క్రీన్ దెబ్బతో స్తంభించే మాటలు
‘‘డాక్టర్, మా పాపకు రెండేళ్లు. ఒక్క మాట కూడా మాట్లాడదు’’ అనేది ప్రస్తుతం నేను వినే అత్యంత సాధారణ ఫిర్యాదు. కారణం తెలుసా? తల్లిని చూస్తూ, వింటూ, అనుకరిస్తూ పిల్లలు ‘‘మాట’’ అనే మ్యాజిక్ నేర్చుకుంటారు.
స్క్రీన్‌లోని కార్టూన్ మాట్లాడుతుంది కాని, వినదు. బిడ్డ ప్రయత్నించినా అది స్పందించలేదు. దీనివల్ల కమ్యూనికేషన్ లూప్ ఆగిపోతుంది. ‘రెండేళ్ల లోపు పిల్లలు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ వల్ల మాటలు రావడం 49శాతం ఆలస్యమవుతుంది’ అని జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్స్ 2020లో జరిగిన పరిశోధనను ప్రచురించింది.
ప్రేమ ముసుగులో ‘‘డిజిటల్ జైలు’’
‘‘మేము ఎడ్యుకేషనల్ వీడియోలు చూపిస్తున్నాం కదా! నష్టమేంటి?’’ అని కొందరు పేరెంట్స్ అనుకుంటారు. కాని, హ్యూమన్ ఇంటరాక్షన్‌ను ఏ వీడియో భర్తీ చేయలేదని నాసా–యేల్ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం చెబుతోంది. వీడియోలు నేర్పే కంటెంట్ బౌద్ధికంగా ఉపయోగపడినా, భావోద్వేగ అనుభూతిని ఇవ్వలేవు.
పిల్లలు నిజమైన ముఖాల నుంచి సహానుభూతి నేర్చుకుంటారు. కథల ద్వారా ఊహాశక్తి పెరుగుతుంది. కాని, స్క్రీన్ యాంత్రికంగా నేర్చుకోవడాన్ని మాత్రమే చేస్తుంది. ఫలితంగా... · భావోద్వేగ స్పర్శ తగ్గిపోతుంది. · స్నేహం కంటే స్క్రీన్ ప్రాధాన్యం పెరుగుతుంది. · పిల్లలో ‘డిజిటల్ లోన్లీనెస్’ ఏర్పడుతుంది.
స్క్రీన్‌తో ఏకాగ్రత లోపం...
శిశువుల మెదడును స్క్రీన్‌లు ‘ఫాస్ట్ రివార్డ్’ సిస్టమ్‌లో కట్టేస్తాయి. రంగులు, ఫ్లాష్‌లు, సంగీతం – ఒక్కో సెకనుకు ఒక కొత్త విజువల్ షాక్. దీని వల్ల మెదడు అటెన్షన్‌ను నిలుపుకోలేదు. ఆ తరువాత బిడ్డ పాఠశాలకు వెళ్లినప్పుడు ఫోకస్ నిలపలేరు. హైపర్ రియల్ స్క్రీన్ ప్రపంచం నచ్చి, రియల్ ప్రపంచం బోరింగ్‌గా మారిపోతుంది.
తల్లిదండ్రులకు సూచనలు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకు ఏ స్క్రీన్ కూడా చూపకూడదు. బదులుగా శిశువులతో ఆడటం, పాడటం, తాకడం లాంటివి చేయాలి. · బిడ్డ ఏడిస్తే వెంటనే ఫోన్ ఇవ్వకండి. దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకోండి. ‘నువ్వు సేఫ్‌గానే ఉన్నావు’ అని సాఫ్ట్‌గా చెప్పండి. తల్లి మాట ఆత్మస్థైర్యం ఇస్తుంది – స్క్రీన్ కాదు.
శిశువుతో కలిసి నడవడం, బొమ్మలతో ఆట, నీటిలో ఆడించడంలాంటివి సెన్సరీ ప్లస్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్‌ను ఇస్తాయి. · 2–5 ఏళ్ల బిడ్డతో కలిసి చిన్న చిన్న ఎడ్యుకేషనల్ వీడియోలు మాత్రమే చూడాలి. ఆ తర్వాత వాటి గురించి చర్చించాలి. ప్రశ్నలు అడగాలి.
సైకాలజిస్ట్ విశేష్
ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
www.psyvisesh.com
(చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!)


