
‘‘సర్, మా అబ్బాయికి 75 శాతం మార్కులు మాత్రమే వస్తున్నాయి. 95 శాతం వచ్చేలా మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా?’’‘‘సర్, మా అమ్మాయిని బెస్ట్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించాం. కాని, అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ లేదు. ఎలాగైనా నీట్‌లో సీట్ వచ్చేలా మైండ్ సెట్ మార్చగలరా?’’ ఇలా చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు. కొంతమంది సెషన్‌లో అడుగుతుంటారు.
‘‘మీ బిడ్డ ఎగ్జామ్‌లో సక్సెస్ అయితే చాలా లేక లైఫ్‌లో కూడా పాసవ్వాలని అనుకుంటున్నారా?’’ అని అడుగుతా. ‘‘లైఫ్‌లో పాసవ్వాలంటే మంచి మార్కులు రావాలి కదా సర్?’’ అని అడుగుతుంటారు అమాయకంగా. చాలామంది తల్లిదండ్రుల్లో ఇలాంటి అభిప్రాయమే ఉంది.
మార్కుల విలువ...
ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌లలో సీటు రావాలంటే మార్కులు కావాల్సిందే! కాని, ఒక బిడ్డ ప్రతిభకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. మార్కులు విద్యార్థి నేర్చుకున్న విషయాలలో రాసే సామర్థ్యం, మీ జ్ఞాపకశక్తిని కొలుస్తాయి. కాని, మీ బిడ్డలోని సృజనాత్మకత, నాయకత్వం, భావోద్వేగ ప్రజ్ఞ, నిర్ణయ సామర్థ్యం, ఇన్నోవేషన్‌లను కొలవలేవు. ఇప్పుడు ప్రపంచం ఈ నైపుణ్యాలనే కోరుకుంటుంది.
ఐక్యూ వల్లనే సక్సెస్ రాదని హార్వర్డ్ పరిశోధన కూడా చెబుతోంది. విజయంలో తెలివితేటలు 15 శాతం పాత్ర పోషిస్తే, సోషల్ స్కిల్స్ 85 శాతం పాత్ర పోషిస్తాయని ఆ పరిశోధనలో తేలింది.
సైన్స్ ఏం చెబుతోంది?
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు డాక్టర్ కరోల్ డ్వెక్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రకారం రెండు రకాల మైండ్ సెట్‌లు ఉంటాయి.
1. ‘నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను’, ‘నాకు ఇన్నే మార్కులు వస్తాయి’ అనుకునే ఫిక్స్‌డ్ మైండ్ సెట్.
2. ‘ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు’, ‘తప్పుల వల్ల నష్టంలేదు, నేర్చుకోవచ్చు’ అనుకునే గ్రోత్ మైండ్ సెట్..
గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని, లాంగ్ టర్మ్ సక్సెస్ సాధిస్తారు. మైండ్ సెట్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో, ఆత్మవిశ్వాసంలో 40 శాతం మెరుగుదల చూపించారు.
మైండ్ సెట్‌తోనే అసలైన విజయం
కొన్నేళ్ల కిందట ఓ విద్యార్థి కోచింగ్ కోసం వచ్చాడు. అతను ఇంటర్మీడియట్‌లో 60 శాతం మాత్రమే సాధించాడు. దాంతో పేరెంట్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. కాని, అతనిలో నాకు కసి, ఉత్సుకత కనిపించాయి. దాంతో అతనికి జీనియస్ మైండ్ సెట్ కోచింగ్ మొదలు పెట్టా.
ఇప్పుడతను బెంగళూరులో ఒక స్టార్టప్ ఫౌండర్. ఐఐటీల్లో చదివినవాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకంటే అతనికి నేర్పించింది సిలబస్ కాదు, సెల్ఫ్–బిలీఫ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జీనియస్ మైండ్ సెట్. జీనియస్ పుడతాడనేది భ్రమ, జీనియస్ డెవలప్ అవుతాడనేది సైన్స్
2030లో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాప్ స్కిల్స్‌గా ఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెబుతోంది. ఉత్తమ ఉద్యోగుల్లో కమ్యూనికేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ ముఖ్యమైన లక్షణమని గూగుల్ చేసిన ప్రాజెక్ట్ ఆక్సిజన్ రీసెర్చ్‌లో కూడా వెల్లడైంది. జీనియస్ మేట్రిక్స్ కోచింగ్‌లో నేర్పేవి ఇవే!
పేరెంట్స్ ఏం చేయాలి..
ఐక్యూ కాకుండా ప్రాసెస్‌ను ప్రశంసించండి. ‘నువ్వు స్మార్ట్’ అని కాకుండా ‘నువ్వు కష్టపడి ప్రయత్నించిన తీరు నచ్చింది’ అని చెప్పండి. దీనివల్ల పిల్లల్లో ప్రేరణ కలుగుతుంది. మెదడులో కొత్త మార్గాలు ఏర్పడుతాయి.
తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ‘ఈ తప్పు నీకు ఏం నేర్పింది?’ అని అడగండి. తప్పులను నార్మలైజ్ చేయండి.
‘నేను లెక్కలు చేయలేను’ అని కాకుండా, ‘నేను ఇప్పటికీ లెక్కలు చేయలేను’ అని చెప్పండి. ఈ చిన్న పదం అద్భుతం చేస్తుంది.
మీ పరాజయాలను, వాటి నుంచి ఏం నేర్చుకున్నారో, ఎలా తిరిగి నిలదొక్కుకున్నారో పిల్లలతో పంచుకోండి. మీ పిల్లలు దాన్ని పాటిస్తారు.
‘‘ఎన్ని మార్కులు వచ్చాయి?’’ అని కాకుండా, ‘‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’, ‘‘ఈ తప్పు నీకు ఏం నేర్పించింది?’’ అని అడగండి.
మార్కుల గురించి కాదు, ప్రయత్నం ఆపేయడంపై టెన్షన్ పడండి. సెల్ఫ్ బిలీఫ్ ఉన్నవాడు ఎక్కడైనా గెలుస్తారు. మార్కులు మాత్రమే ఉన్నవాడు మైండ్ సెట్ లేకపోతే ఆగిపోతారు.