
మట్టిలోని బాక్టీరియా అనగానే మొక్కలకు పోషణ ఇచ్చే జీవులుగా మాత్రమే అనుకోకండి. ఇప్పుడు అదే బాక్టీరియా మనకు విద్యుత్తును కూడా ఇస్తోంది! పచ్చదనానికి ఆధారంగా పనిచేసే సూక్ష్మజీవులే ఇప్పుడు పవర్ జనరేటర్లుగా మారిపోయాయి. ఫిలిప్పన్స్ ఇంజినీర్లు కేవలం మట్టిలో ఉండే బాక్టీరియాతో పనిచేసే ఒక వీథి దీపాన్ని తయారు చేశారు.
దీనికి ఎటువంటి విద్యుత్తు తీగలు అవసరం ఉండవు. దీపం కింద ఉండే నేలలోని ప్రత్యేకమైన బాక్టీరియా జీవక్రియలో భాగంగా విడుదల చేసే ఎలక్ట్రాన్లను ‘మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్స్’ సాంకేతికత ద్వారా విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తుతో ఒక బల్బును నాలుగు నుంచి ఆరు గంటలపాటు వెలిగించేలా ఏర్పాటు చేశారు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు.
అందుకే, ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని గ్రామాల్లో ఇది చాలా ఉపయోగపడే పరిష్కారంగా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఈ ఆవిష్కరణ ప్రయోగ దశలోనే ఉంది. మార్కెట్‌లోకి పూర్తిగా తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా వాడకంలోకి వస్తే, మీ ఇంటి పక్కనే ఉన్న మట్టి నుంచే గ్రీన్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. ఓ వైపు చెట్టు పెరుగుతుంది, మరోవైపు చుక్కలా బల్బు వెలుగుతుంది!
(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..)