
జీవితం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.. వ్యాయామం అంటే సరైన జిమ్‌ను ఎంచుకోవాలి. లేదంటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు.. సిటీ యూత్‌లో పెరుగుతున్న ఫిట్‌నెస్ క్రేజ్‌ను వాడుకుని లాభార్జనే ధ్యేయంగా ఎటువంటి అవగాహన లేకుండా జిమ్‌లు నెలకొల్పుతున్న వారూ ఉన్నారు.. సో బీకేర్ ఫుల్.. జిమ్ ఎంపికలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు..
వ్యాయామాలు చేయడానికి ఎంచుకునే జిమ్ వీలైనంత వరకూ ఇంటికి దగ్గరగానే ఉండాలి. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, రెగ్యులారిటీ అలవాటై డుమ్మాలు కొట్టే అవకాశం తగ్గుతుంది.
నగరంలో ఇపుడు వీధికో జిమ్ ఉంది. ఏరియాకో ఫిట్‌నెస్ సెంటర్ ఉంది. అయితే అన్నీ మన అవసరాలను తీర్చేవి కాకపోవచ్చు. కొన్నింటిలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జిమ్‌ని ఎంచుకునేటప్పుడు కొన్ని సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసుకోవాలి.
సదరు జిమ్/ఫిట్‌నెస్ సెంటర్ గత చరిత్ర ఏమిటి? అక్కడ మెంబర్లుగా ఉన్న ఇతరుల అభిప్రాయాలూ సేకరించాలి. అంతేకాకుండా వర్కవుట్స్ చేసే ప్రాంగణం సరిపడా విస్తీర్ణంలో ఉందా? లేదా? ఏసీ జిమ్ అయితే లోపలి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి.
శిక్షణ అందించే కోచ్‌లకు సరైన సర్టిఫైడ్ అర్హతలు ఉన్నాయో లేదో వాకబు చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే విడిగా మాట్లాడుకోవాలని పలు జిమ్స్ సూచిస్తుంటాయి. సదరు జిమ్‌లో మెంబర్ల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సామర్థ్యానికి మించి మెంబర్లను చేర్చుకుంటే అక్కడి ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగించుకోవడానికి మనం క్యూలో నిలుచునే దుస్థితి కూడా తలెత్తవచ్చు.
కొన్ని జిమ్‌లు చూడటానికి ఆర్భాటంగా ఉండి, శిక్షణ పరంగా అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కొన్ని చూసేందుకు సాధారణంగా ఉన్నా.. మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ లుక్‌కు.. పడిపోవద్దు. జిమ్‌లో సభ్యత్వం తీసుకునేటప్పుడు నిర్వాహకుల తీయటి పలుకుల మాయలో పడి
పోవద్దు. వీలున్నంత వరకూ లైఫ్ మెంబర్‌షిప్‌ల జోలికి పోవద్దు. ఏడాది లోపున మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే మధ్యలో మీకేమైనా అసౌకర్యం కలిగినా, జిమ్ నచ్చకపోయినా మారేందుకు ఇబ్బంది ఉండదు.
జిమ్‌లో దుస్తులు మార్చుకునేందుకు, మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునేందుకు సరైన వసతులు ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి.
చాలా వరకూ జిమ్‌లలో యువతీ యువకులకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఇది గమనించి
అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.
ఒకసారి వర్కవుట్ టైమ్ ఎంచుకున్న తర్వాత అది వెంట వెంటనే మార్చుకోవడానికి జిమ్‌లో నిబంధనల ప్రకారం వీలుండకపోవచ్చు. కాబట్టి, రోజూ ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు అనువైన సమయాన్ని ఒకటికి రెండుసార్లు ముందుగా ఆలోచించి నిర్ణయించుకోవాలి.
ఎంసీహెచ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న వ్యాయామ కేంద్రాలలో సాధారణ స్థాయిలోనే నెలవారీ రుసుము వసూలు చేస్తున్నారు. తక్కువ్చ ఫీజు చెల్లించగలిగిన వారికి ఇవి నప్పుతాయి.
స్టార్ హోటల్స్, క్లబ్స్, రిసార్ట్స్.. అన్నీ జిమ్‌లను నిర్వహిస్తున్నాయి. రూమ్స్‌లో బస చేసిన అతిథులతో పాటు కేవలం జిమ్ మాత్రమే ఉపయోగించుకునే నగరవాసులకూ తమ సేవలను ఇవి అందిస్తున్నాయి.
కొన్ని బ్రాండెడ్ జిమ్స్ ప్రొటీన్ షేక్‌ల విక్రయంతో మొదలుపెట్టి సభ్యులకు రకరకాల ఆకర్షణలు చూపిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటాయి. అలాంటివి ఎంచుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక ఫలితాల మీద ఆశతో స్టెరాయిడ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు.
కొన్ని జిమ్‌లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్‌కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్‌లు ఇంటర్నేషనల్ మెంబర్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
కొన్ని జిమ్‌లలో మనకు కేటాయించిన సమయంలో అదనపు రుసుము చెల్లించగలిగితే.. మనకు మాత్రమే పరిమితమై వ్యక్తిగత సేవలు అందించే కోచ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి దశలోనే పర్సనల్ ట్రైనింగ్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం చేశాక.. మన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు.
కొన్ని జిమ్‌లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్‌కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్‌లు ఇంటర్నేషనల్ మెంబర్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
నగరంలోని జిమ్‌ల మెంబర్‌షిప్ వివరాలు..
టాప్‌క్లాస్ కేటగిరిలోకి వచ్చే ‘స్పా’లలో ఎక్సర్‌సైజ్‌లు చేసే అవకాశంతో పాటు మసాజ్, స్టీమ్‌బాత్, సోనాథెరపీ, పార్లర్.. వంటి అదనపు సౌకర్యాలూ ఉంటాయి. ఇంటి తరహాలో కొన్ని గంటల పాటు ఇక్కడ గడిపేందుకు వీలుంది. సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.25వేలు.
మూడో కేటగిరీలోకి వచ్చే జిమ్స్‌లో అన్ని రకాల ఎక్విప్‌మెంట్ ఉంటుంది. జిమ్ మొత్తానికి ఒకరిద్దరు మించి ట్రయినర్లు ఉండరు. వీటికి రుసుము ఏడాదికి రూ.8వేలు ఆపైన.
ఆ తర్వాత కేటగిరిలోకి వచ్చే ఫిట్‌నెస్ సెంటర్లలో అత్యాధునిక జిమ్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అలాగే స్టీమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ప్రత్యేకంగా ఫిట్‌నెస్ డ్యాన్స్ ఫ్లోర్స్.. వగైరా వసతులుంటాయి. వీటి సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.15వేలు ఆపైన.
(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఐనా..! స్టేజ్ 4 కేన్సర్ బాధితురాలి అవేదన..!)