
బ్యాంకులకు ఆర్‌బీఐ ప్యానెల్ సూచన
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) నుంచి వచ్చే రిస్క్‌లను అధిగమించే విధానాన్ని బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు రూపొందించుకోవాలంటూ ఆర్‌బీఐ ప్యానెల్ ఒకటి సిఫారసు చేసింది. తగిన రక్షణలు లేకపోతే రిస్క్ లు మరింత పెరిగిపోవచ్చని పేర్కొంది. ఆర్థిక రంగంలో ఏఐని బాధ్యాయుత, నైతిక మార్గంలో వినియోగించేందుకు తగిన కార్యాచరణను సూచించాలంటూ గత డిసెంబర్‌లో ఆర్‌బీఐ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ ప్యానెల్ తన నివేదికను ఆర్‌బీఐకి సమరి్పంచింది. రిస్క్ లకు తగిన రక్షణలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏఐతో ఆర్థిక సేవల రంగం తన సామర్థ్యాలను పెంచుకోవచ్చని ప్యానెల్ సూచించింది. అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ కొత్త మార్గాలను చూపిస్తుందని పేర్కొంది. బహుళ నమూనా, బహుభాషా ఏఐతో ఆర్థిక సేవలకు దూరంగా ఉన్న వారికి సైతం చేరువ కావొచ్చని సూచించింది. ఆర్‌బీఐ నియంత్రణల్లోని సంస్థలు బోర్డు ఆమోదిత ఏఐ విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొంది. సైబర్ భద్రత విధానాలను మెరుగుపరుచుకోవడం, ఘటనలకు సంబంధించి వెంటనే నివేదించడం తదితర సూచనలను కూడా ప్యానెల్ చేసింది.