
శ్రీశైలం, సాగర్‌లకు భారీగా వరద
శ్రీశైలం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నాగార్జునసాగర్ 20 క్రస్ట్‌గేట్లు ఎత్తివేత
రెండు జలాశయాల వద్ద భారీగా విద్యుదుత్పత్తి
దోమలపెంట/నాగార్జునసాగర్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఐదు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్ వే ద్వారా 41,112 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేçశుల నుంచి 30,653 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,10,644 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. దీంతో 5 గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేరకు ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,509 క్యూసెక్కులు కలిపి 65,824 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 25,333, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,426 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.357 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి 1,56,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 29,516 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశ యం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు). ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులు(305.7464టీఎంసీలు) ఉంది.