ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు వేల్పుల మెహంత్‌బాబు కుటుంబం మూడేళ్లుగా ఓ కోడిపుంజును పెంచుతున్నారు. కుటుంబంలో ఒకరిగా భావిస్తూ పెంచుతున్న ఈ పుంజు కొత్త వ్యక్తులు వస్తే శునకం మాదిరి ఎగబడుతూ చేదోడుగా ఉండేది. దీంతో మెహంత్‌బాబు తన ఇంటి ముందు ‘కుక్క ఉంది జాగ్రత్త’ అని బోర్డు సైతం ఏర్పాటు చేశాడు.
ఈ క్రమేన 28వ తేదీన వీధికుక్కలు కోడిపుంజుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో కోడిపుంజు మృతి చెందింది. దీంతో కుటుంబంలోని వ్యక్తి మృతి చెందినట్లు ఆవేదన చెందిన మెహంత్‌బాబు కుటుంబీకులు దానికి అదేరోజు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాక మంగళవారం కర్మకాండలు నిర్వహించి శ్మశానంలో కోడిపుంజు బొమ్మతో కూడిన శిలాఫలకం ఏర్పాటుచేయడంతో పాటు పలువురు స్థానికులకు విందు ఏర్పాటు చేశాడు.


