
‘గృహజ్యోతి’ ఉచిత విద్యుత్ పథకం కుదింపు యోచనలో ప్రభుత్వం
ప్రస్తుతం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఈ పథకం వర్తింపు
ఇకపై ఏ నెలలో అయినా ఒక్కసారి 200 యూనిట్లు దాటితే లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ బంద్!
కొత్తగా ఈ పథకంలో దరఖాస్తులను అంగీకరించొద్దని నిర్ణయం
ప్రస్తుతం 51.26 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు..
వీటికి ప్రతినెలా రూ.185–200 కోట్ల వ్యయం
సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఉన్నతస్థాయిలో చర్చలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లలోపు ఉంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. అయితే, ఈ పథకం లబ్ధిదారుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు మించితే వారు పథకానికి అర్హత కోల్పోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. ఈ మేరకు గృహజ్యోతి పథకాన్ని కుదించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ జరుగుతోంది.
గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల సంఖ్యను కట్టడిచేయడంతోపాటు కొత్త లబ్ధిదారులు పెరగకుండా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఈ పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతూపోతే ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుందన్న ఆందోళనతో లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
16 నెలల్లో 12 లక్షల మంది పెరిగారు..
గృహాలకు ప్రతినెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలును ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం అమలవుతోంది. మొదట్లో 39 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.
ఆ తరువాత కూడా దరఖాస్తులు రావడంతో ఈ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైనట్టు తెలిసింది. పథకం ప్రారంభమైన 16 నెలల్లో కొత్తగా 12 లక్షల మంది చేరారు. అంటే జూలైలో ఈ పథకం కింద లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సబ్సిడీ కింద ప్రతి నెలా రూ.185 నుంచి 200 కోట్ల వరకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు చెల్లిస్తోంది.
ఒక్క యూనిట్ ఎక్కువైనా..
విద్యుత్ వినియోగం ఆధారంగా 0–50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.95 పైసలు, 51–100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.3.10 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. వినియోగం 100 యూనిట్లకు పెరిగితే 0–200 యూనిట్ల మధ్య వినియోగానికి ప్రతీ యూనిట్‌కు రూ.3.40 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో 0–50, 50–100 యూనిట్లను వినియోగించే పేదలే ఎక్కువ.
వీరితోపాటు 100–200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న లబ్ధిదారులందరికీ జీరో బిల్ వస్తోంది. అంటే 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువైనా వారు పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఒక నెలలో 201 యూనిట్లు విద్యుత్ వినియోగించి.. ఆ తరువాత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా వారికి ఈ పథకం వర్తిస్తోంది. ఇకపై ఏదైనా నెలలో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తే వారిని శాశ్వతంగా ఈ పథకం కింద అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినట్టు తెలిసింది.
తెల్ల కార్డులు 93 లక్షలు..
గృహజ్యోతి పథకం మార్గదర్శకాల ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా అర్హులు. రాష్ట్రంలో దాదాపు 93 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. అయితే, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హుల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. సకాలంలో డిస్కంలకు ఆ నిధులు చెల్లించకుంటే ఆ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.185 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు డిస్కంలకు సబ్సిడీగా చెల్లిస్తోంది. వినియోగదారుల సంఖ్య పెరిగితే సబ్సిడీ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.