
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్‌గా మారింది.
ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
