
కామెంట్
ఇండియాపై ట్రంప్‌కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు.
రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్‌కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్‌పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్‌పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా?
చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్‌ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.
మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్‌తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్‌పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది.
‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్‌ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్‌ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్‌కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.
అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్‌తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు.
సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...
ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు.
ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది.
రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు?
ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు.
రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది.
ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.
చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్‌తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా?
ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ.
మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్‌పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్